దొంగే.. దొంగా.. దొంగా అని..


దొంగే.. దొంగా.. దొంగా అని..
స్వాధీనం చేసుకున్న ఆభరణాలతో డీఎస్పీ కిషోర్‌కుమార్‌

మార్కాపురం గడియార స్తంభం, న్యూస్‌టుడే: ఎదురుగా ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడి తన ఇంట్లో కుడా దొంగతనం జరిగిందని యజమానితో పాటు పోలీసుల్ని నమ్మించేందుకు ప్రయత్నించిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 12వ తేదీన బేస్తవారపేటలో జరిగిన చోరీ కేసు వివరాలను మార్కాపురం డీఎస్పీ ఎం. కిషోర్‌కుమార్‌ బుధవారం స్థానిక గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెళ్లడించారు. బేస్తెవారపేటకు చెందిన జనపాటి ఆదినారాయణ డ్రైప్రూట్స్‌ వ్యాపారంలో భాగంగా ఇతర ప్రాంతాలకు వెళుతుంటారు. ఈ నెల 12న తన భార్యతో పాటు వ్యాపారానికి కంభం వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్నారు. అదే సమయంలో ఎదురు ఇంట్లో నివాసం ఉండే ఓ మహిళ వచ్చి మా ఇంట్లోనూ.. మీ ఇంట్లోనూ దొంగలు పడ్డారని చెప్పింది. వెంటనే ఆదినారాయణ తన ఇంట్లో ఉన్న నగల పెట్టెను చూసుకోగా అది కనిపించలేదు. దీంతో చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ పర్యవేక్షణలో సీఐ సుధాకరరావు, బేస్తవారపేట ఎస్సై బాలకృష్ణ విచారణ చేపట్టారు. ఎదురింట్లో చోరీ జరగలేదని గుర్తించిన పోలీసులకు ఆ ఇంట్లో ఉన్న మహిళపై అనుమానం వచ్చింది. అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. దీంతో బుధవారం ఆ మహిళను అరెస్టు చేసి ఆమె నుంచి 112 గ్రాముల బంగారంతో పాటు రూ. 1.95 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు.

Post a Comment

Previous Post Next Post