గుడివాడ: గుడివాడ ఎన్జీవో హోంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొడాలి నాని, ఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, పలువురు రాష్ట్ర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ఉద్యోగులు కొడాలి నాని దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ.. సీఎం జగన్‌ది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమన్నారు. ఉద్యోగులకు న్యాయం చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తోందన్నారు.
ఇప్పుడున్న పథకాలతో ఉద్యోగులు ఇబ్బంది పడుతుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన పథకాలతో ఏమవుతారని కొడాలి నాని ప్రశ్నించారు. పెనం మీద ఉండడం కరెక్టా.. పొయ్యిలో పడడం కరెక్టో ఉద్యోగులు ఆలోచించుకోవాలన్నారు. మనసుతో ఆలోచించే జగన్ ఉద్యోగుల కష్టాలు ఇబ్బందులను కచ్చితంగా పరిష్కరిస్తారన్నారు. ఉద్యోగులను ప్రభుత్వం తమ సొంతవాళ్ళుగా భావిస్తూ పేదల పథకాల కోసం కొన్ని సందర్భాల్లో వారికి ఇచ్చే నిధులు వినియోగించామని కొడాలి నాని తెలిపారు. పేదలకు మంచి చేసిన పుణ్యం ఉద్యోగులకు కూడా దక్కుతుందన్నారు. సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు చెప్పిన సమస్యలను తప్పకుండా సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని.. ఉద్యోగుల మద్దతు ప్రభుత్వానికి ఉండాలని కొడాలి నాని పేర్కొన్నారు.