విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు

విజయవాడ శరన్నవరాత్రులు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేవీ నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో ఎనిమిదో రోజున కనక దుర్గమ్మ దుర్గాదేవిగా భక్తులను కరుణిస్తున్నారు. ఈ ఏడాది ఉత్సవాలు మాత్రం 9 రోజుల్లోనే ముగుస్తున్నాయి. దసరా రోజున సోమవారం రెండు అలంకాారాలు ఉంటాయి. తెప్పోత్సవంతో ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. మూలా నక్షత్రం నుంచి భక్తుల రాక భారీగా పెరిగింది.


విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో ఎనిమిదో రోజు కనకదుర్గమ్మ.. దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. లోక కంఠకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి.. దుర్గగా అమ్మవారు వెలుగొందారు. దుర్గమాసురుడి సంహారం తర్వాత ఇంద్ర కీలాద్రిపై స్వయంగా అమ్మవారు ఆవిర్భవించినట్టు పురాణాలు చెబుతున్నారు. ‘దుర్గే దుర్గతి నాశని’ అనే శ్లోకం భక్తులకు శుభాలను కలగజేస్తుంది. శరన్నవరాత్రుల్లో దుర్గాదేవిని దర్శించుకోవడం వల్ల దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తుందని, దివ్యరూపిణి అయిన దుర్గమ్మ దర్శనం సకల శ్రేయోదాయకమని భక్తుల నమ్మకం
ఇక, రేపటితో ఉత్సవాలు ముగియనున్న తరుణంలో శనివారం నుంచి భక్తుల రద్దీ బాగా పెరిగింది. శనివారం లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని 90 వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నట్టు అధికారులు తెలిపారు. సోమవారంతో ఉత్సవాలు ముగియనున్న తరుణంలో భక్తుల రద్దీ బాగా పెరిగిందని, ఏటా మాదిరిగానే ఉత్సవాల చివరి మూడు రోజుల్లో భవానీలు ఈసారి కూడా పెద్దసంఖ్యలో రానున్నారని తెలిపారు.
శనివారం నుంచి భవానీ భక్తుల రాక పెరిగిందని, చివరి రెండు రోజులు కూడా భక్తుల రద్దీ భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా భద్రతా ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. మరోవైపు, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రేపటితో ముగియనుండగా తేప్పోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల చివరి రోజు సోమవారం ముగింపు సందర్భంగా కృష్ణా నదిలో గంగా పార్వతీ సమేత దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన తెప్పోత్సవం ట్రయల్‌రన్‌ను ఆదివారం నిర్వహిస్తారు.
ఇదిలా ఉండగా, సోమవారం అమ్మవారు రెండు అవతారాల్లో దర్శనమిస్తారు. తొలుత మహిషాసుర మర్దినిగా.. తర్వాత రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిని అలకరించనున్నారు. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మహిషాసుర మర్దినిగా, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11 వరకు రాజరాజేశ్వరీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుంది.

Post a Comment

أحدث أقدم