ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు


 

 ఉత్తరాఖండ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. కొండచరియలు విరిగిపడుతుండటంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికులు అక్కడే చిక్కుకున్నారు. తమను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. కొండచరియలు ఘాట్ రోడ్డులో విరిగిపడుతుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రోడ్డుపైనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మరో రెండ్రోజుల పాటూ భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాతో వారంతా భయాందోళనలో ఉన్నారు. తమవారి గురించి సరైన సమాచారం తెలియక కుటుంబసభ్యులు ఆందోళనలో ఉన్నారు.  

ఏపీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్లిన యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు రోజులుగా ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న వర్షాలతో అనేక మంది యాత్రికులు అక్కడ చిక్కుకుపోయారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.. ఎక్కడికక్కడ స్తంభించాయి. రుషికేశ్‌కు 40కి.మీ దూరంలో వేలాది మంది యాత్రికులు చిక్కుకున్నారు. వాహనాలు నిలిచిపోవడంతో యాత్రికులు, స్థానికులు రోడ్డుపైనే 20గంటలుగా పడిగాపులు కాస్తున్నారు. కొడియాల దగ్గర ఇలా 1500 వాహనాలు, 20వేల మంది ప్రజలు ఉండిపోయారు.

బెంగళూరు, ఏపీ నుంచి వెళ్లిన పలువురు తెలుగు యాత్రికులు కూడా చిక్కుకున్న వారిలో ఉన్నారు. వారంతా తిరుగు ప్రయాణంలో అక్కడ ఆగిపోయినట్లు తెలుస్తోంది. త్వరగా సహాయక చర్యలు చేపట్టాలని యాత్రికులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమవారి గురించి సరైన సమాచారం తెలియక ఇక్కడ బంధువులు ఆందోళనలో ఉన్నారు. యాత్రికులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఉత్తరాఖండ్‌లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి.. డెహ్రాడూన్‌తో పాటు హిల్‌స్టేట్‌లోని ఐదు జిల్లాల్లో వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది. ఈ వానలతో కేదార్‌నాథ్ యాత్ర మార్గంలోని గౌరీకుండ్ సమీపంలో వరదలు సంభవించాయి. గర్హ్వాల్, కుమావోన్ ప్రాంతాల్లోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో రెండు రోజులు వర్ష సూచనతో యాత్రికుల్లో ఆందోళన మొదలైంది.

Post a Comment

Previous Post Next Post