గ్రామం నడిబొడ్డునే నాలుగు పెద్దపులి పిల్లలు కలకలం.. ఎట్నుంచి తల్లి ఎటాక్‌ చేస్తుందోనని గ్రామస్తులు హడల్‌

ఈమధ్యకాలంలో వన్య మృగాలు తరచూ జనవాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. గ్రామాలు, పంట పొలాల్లో తిరుగుతూ కనిపించిన పెంపుడు జంతువులు, మనుషులపై కూడా దాడి చేస్తున్నాయి.

ఇప్పటికే అనేక చోట్ల ఈ వన్య మృగాల దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరెందరో చావు తప్పి తీవ్ర గాయాలపాలై బతుకుతున్నారు. తాజాగా నంద్యాల జిల్లాలో పెద్దపులి పిల్లల సంచారం కలకం రేపింది. ఒక్కేసారి నాలుగు పెద్దపులి పిల్లలు కనిపించడంతో స్థానికులు భయందోళన వ్యక్తం చేస్తున్నారు.

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు, నందికొట్కూరు, వెలుగోడు ప్రాంతాల్లో తరచూ పెద్ద పులుల సంచారం కనిపిస్తుంది. ఇటీవలే ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపింది. తాజాగా నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో పెద్దపులి పిల్లలు కలకలం రేపాయి. కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురంలో ఆదివారం ఉదయం బహిర్భూమికి బయటకు వెళ్లిన ఓ యువకుడు ఈ పెద్దపులి పిల్లలను గమనించాడు. ఈ క్రమంలో ఊర్లోని ఓ ఇంటి వద్ద గొడకు ఆనుకుని పులి పిల్లలు నిద్రిస్తున్నాయి. వీటిని గమనించిన ఆ యువకుడు గ్రామస్థులకు సమాచారం ఇచ్చాడు. ఒకేసారి నాలుగు పులి పిల్లలు కనిపించడంతో గ్రామస్తులు భయపడిపోతున్నారు.

తల్లి పెద్దపులి ఈ చుట్టుపక్కలే సంచరిస్తుందేమోననే సందేహం వ్యక్తం చేస్తున్నారు. తల్లి రావడంతోనే ఈ పిల్లలు కూడా వచ్చి ఉంటాయని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. అలానే పులి పిల్లలు ఇక్కడే ఉండటంతో తల్లి పులి మళ్లీ వస్తుందేమోనని గ్రామస్థులు భయాందోళ వ్యక్తం చేస్తున్నారు. పులి పిల్లలను తీసుకొచ్చి ఓ గదిలో బంధించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.



Post a Comment

Previous Post Next Post