అసలేం జరిగిందంటే..?
స్థానికుల కథనం మేరకు.. తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలంలోని ఏ.రంగంపేటకు చెందిన హరి కృష్ణ నాయుడు కుమారుడు వంశీ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన తెలంగాణలోని కరీంనగర్కు చెందిన ఓ మహిళను మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఆటో యజమాని తిరుపతి రూరల్ మండలం, ముస్లింపేటకు చెందిన అన్వర్ తరచూ వంశీ వద్దకు వచ్చి వెళ్తూ ఉండేవాడు. అదే సమయంలో వంశీ భార్యతో అన్వర్ కి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వంశీ ఇంట్లోలేని సమయంలో అన్వర్ వచ్చేవాడు. వంశీ భార్యతో కలిసి చాలా సమయం గడిపేవాడు. అయితే ఈ విషయాన్ని చుట్టు పక్కల వాళ్లకు వంశీకి తెలియజేయడంతో తన భార్య అక్రమ సంబంధం
వ్యవహారం గురించి భర్త తెలుసుకున్నాడు. భార్యను నిలదీశాడు. దీంతో వంశీ భార్య రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోతున్నానని చెప్పి ప్రియుడు అన్వర్ చెంతకు చేరింది.
స్నేహితులతో కలిసి కిడ్నాప్.. ఆపై దాడి, తలపై మూత్ర విసర్జన
భార్య వదిలేసి పోవడంతో వంశీ ఆటో నడపడం మానేసి, బెంగళూరులో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే నెలన్నర క్రితం తన భార్య ఫేస్ బుక్ లో అన్వర్ తోనే ఉన్నట్లు గుర్తించాడు. గత నెల 13వ తేదీన తన భార్యతో పాటు అన్వర్ చనిపోయాడంటూ ఫేస్ బుక్ లో ఓ పోస్టు చేశాడు. దీన్ని జీర్ణించుకోలేని ఆన్వర్, చంద్రగిరికి చెందిన తన స్నేహితుడు హర్షతో కలిసి బెంగళూరులోని వంశీని కిడ్నాప్ చేసి చంద్రగిరికి తీసుకొచ్చారు. కొంతమంది స్నేహితులతో కలిసి వంశీని చిత్ర హింసలకు గురి చేశారు. అంతే కాకుండా సైలెన్సర్ తో శరీరం అంతా కాల్చారు. ఆపై తలపై మూత్రం పోశారు. అంతటితో ఆగకుండా వంశీకి గుండు కొట్టించి వీడియోలు చిత్రీకరించారు. అనంతరం బాధితుడిని బెదిరించి అన్వర్ అనే వ్యక్తిపై తప్పుగా పోస్టులు పెట్టానని, అందుకు ప్రాయశ్చితంగా గుండు కొట్టించుకున్నట్లు బలవంతంగా ఓ వీడియోను చిత్రీకరించి వైరల్ చేశారు. అన్వర్ దురాగతంపై శుక్రవారం వీడియో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. దీనిపై పిర్యాదు రాక పోయినప్పటికీ కేసు నమోదు చంద్రగిరి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. బాధితుడిని గుర్తించి జరిగిందేంటో అడగ్గా..అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఈ వార్త సంచలనం రేపుతోంది.