లోకేష్ ఇచ్చిన హామీ ఏంటి..వంగవీటి రాధా అడిగిందేంటి.

ఎపీలో వచ్చే ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులు కూడా చోటుచేసుకుంటున్నాయి.
దీంతో పార్టీలు కూడా నేతల్ని కాపాడుకునే పనిలో పడుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా పార్టీ మారతారని భారీగా ప్రచారం జరిగిన విజయవాడ నేత వంగవీటి రాధా (Vangaveeti Radha) నిన్న టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) ను కలిశారు. వీరిద్దరి చర్చల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా యువగళం పేరుతో పాదయాత్ర మొదలుపెట్టిన నారా లోకేష్ ను విజయవాడ టీడీపీ అసంతృప్త నేత వంగవీటి రాధా నిన్న పీలేరు వద్ద కలిశారు. త్వరలో పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్న తరుణంలో వంగవీటి రాధాతో టచ్ లోకి వెళ్లిన అధిష్టానం.. పార్టీలో నేతలతో ఆయన్ను మాట్లాడించి చివరికి నారా లోకేష్ పాదయాత్రకు రప్పించినట్లు తెలుస్తోంది. అయితే లోకేష్ ను కలిసిన వంగవీటి రాధా.. ఆయనతో ఏం చర్చించారు, లోకేష్ నుంచి ఎలాంటి హామీ తీసుకున్నారనే దానిపై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన వంగవీటి రాధా.. గతంలో తన తండ్రి రంగా హత్యకు కారణమైన పార్టీలోకి వెళ్లడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే తాను మాత్రం వ్యక్తులు చేసిన తప్పుకు పార్టీ ఎలా కారణమన్న వాదన తెరపైకి తెచ్చారు. దీంతో ఈ వ్యవహారం సద్దుమణిగింది. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేసుకోకుండా టికెట్ ఆశించడంతో టీడీపీ అధిష్టానం కూడా ఆయనకు నచ్చజెప్పి పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా ఎన్నికల్లో వాడుకుంది. ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత తిరిగి సైలెంట్ అయిపోయిన రాధా.. వైసీపీలో ఉన్న పాతమిత్రులతో పాటు టీడీపీ నేతలతోనూ కలిసి ఈ నాలుగేళ్లుగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.అయితే చివరిగా గతంలో తాను ఆశ పెట్టుకున్న విజయవాడ సెంట్రల్ సీటు కావాలని నారా లోకేష్ ను తాజాగా అడిగారు.
అయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కేవలం 25 ఓట్లతో ఓడిపోయిన సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావుకు మరోసారి అక్కడి నుంచే బరిలోకి దింపాలని టీడీపీ నిర్ణయించింది. ఇదే విషయాన్ని వంగవీటి రాధాకు చెప్పేసిన నారా లోకేష్.. మరో కీలక హామీ ఇచ్చారు. టీడీపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోతోందని, అనంతరం ప్రభుత్వం లో కీలక పదవి ఇస్తామని లోకేష్ ఆయనకు హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలూ వద్దన్నారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన వంగవీటి రాధా.. లోకేష్ పాదయాత్రలో ఇకపై వారానికి రెండుసార్లు పాల్గొంటానని హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో పార్టీపై రాధాకు ఉన్న అసంతృప్తిని తొలగించి, కీలక పదవి హామీ ఇచ్చిన లోకేష్..ఆయన పార్టీ మార్పుకు చెక్ పెట్టడంతో పాటు పాదయాత్రలోనూ భాగస్వామిని చేయగలుగుతున్నారు.

Post a Comment

أحدث أقدم