ఏపీకి పొంచి ఉన్న వాయుగుండం..

ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితికి సంబంధించి భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజాగా బుధవారం ఉదయం మరికొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో వానలు దంచుతుండగా, రాబోయే రెండు రోజులపాటు ఏపీ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల అల్పపీడనం ఏర్పడిందని, ఇది వాయుగుండంగా బలపడే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అంచనా వేసింది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండగం మారనుంది. ఇది రానున్న 36గంటల్లో నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో కేంద్రీకృతమై, వాయుగుండంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. తదుపరి 48 గంటల్లో (11వ తేదీన) ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వాన పడుతుందని, తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని, మత్యకారులు వేటకు వెళ్లకపోవడమే మంచిదని ఐఎండీ సూచించింది. కోస్తాలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలో మీటర్లు వేగంతో గాలులు వీస్తున్నందున ఈనెల 12వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం సూచించింది.

ఏపీలో మంగళవారం నాటి వాతావరణం పొడిగా ఉండగా, బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడనున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. అల్పపీడనం కారణంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి.

Post a Comment

أحدث أقدم