నేటి 10 ముఖ్యంసలు


1.కూరగాయలు ఎంత భారమాయె!


కూరగాయల ధరల మంటకు సామాన్యులు అల్లాడుతున్నారు. టమాటాల చిల్లర ధర రైతుబజార్లలో కిలో రూ.60కి చేరితే బయట మార్కెట్లలో ప్రాంతాలను బట్టి రూ.80 నుంచి రూ.100 దాకా విక్రయిస్తున్నారు. నగరానికి కాస్త దూరంగా రూ.50 నుంచి 60 మధ్య అమ్ముతున్నారు. ధరల మంట భరించలేక నాణ్యతలేని, మచ్చలు పడిన, పనికిరాని కూరగాయలను సైతం కొందరు కొంటున్నారు.

2.పల్లెకు వైద్యం

రాబోయే రోజుల్లో కార్పొరేట్‌ ఆసుపత్రులతో.. ప్రభుత్వ వైద్యం పోటీపడాలనేదే తమ ఆకాంక్ష అని, ఆ దిశగా సర్కారు వైద్యాన్ని బలోపేతం చేస్తున్నామని వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బస్తీ దవాఖానాలతో మంచి ఫలితాలు రావడంతో సీఎం కేసీఆర్‌ పల్లె దవాఖానాల పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. త్వరలో నాలుగు వేల పల్లె దవాఖానాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు

3.ఉదారంగా ఆదుకోండి

‘‘వరదలతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఈ సంక్షోభ సమయంలో ఆదుకోవాలి. తక్షణం తాత్కాలికంగా రూ.1,000 కోట్ల సాయం అందించాలి. వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన వారితో కేంద్ర బృందాన్ని ఏర్పాటు చేసి వరదలు, వర్షాలతో రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో అంచనా వేయించి, పూర్తి స్థాయిలో ఆదుకోవాలి’’ అని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాలను కోరుతూ ముఖ్యమంత్రి జగన్‌ విడివిడిగా లేఖలు రాశారు.

4.సీఎం ఇష్టాన్ని ఎవ్వరం కాదనలేం!: పిల్లి సుభాష్‌

‘శాసనమండలి రద్దు రాజకీయ నిర్ణయం. ఆనాటి పరిస్థితులకు అనుగుణంగానే సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. అది ఆయన ఇష్టం.ఎవరూ కాదనలేం. దానికనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత సుశిక్షితులైన పార్టీ సభ్యులుగా మాపై ఉంటుంది’ అని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ స్పష్టంచేశారు.

5.నడవలేడు.. నడిపించలేడు!


‘ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నడవలేడు, తిరగలేడు. వృద్ధుడు కదా! మొండికేసిన ఎద్దును ముల్లుగర్రతో పొడిచేందుకే నేను వచ్చా. ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లకే పరిమితమై యంత్రాంగాన్ని నడిపించలేకపోతున్నారు’ అని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

6.లక్షణాలున్న కొవిడ్‌ నుంచి 50% రక్షణ

లక్షణాలు బయటకు కనిపించే స్థాయిలో (సింప్టమాటిక్‌) కొవిడ్‌ బారిన పడకుండా రక్షించడంలో కొవాగ్జిన్‌ టీకా 50% సమర్థతతో పనిచేస్తోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 15 నుంచి మే 15 వరకు మహమ్మారి రెండో ఉద్ధృతి తీవ్రంగా ఉన్న అత్యంత సంక్లిష్ట సమయంలో పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా దిల్లీ ఎయిమ్స్‌లో 2,714 మంది ఆరోగ్య సిబ్బంది పరిస్థితిని పరిశీలించారు.

7.దేశాన్ని నడిపించేంత డబ్బు మా దగ్గర లేదు: ఇమ్రాన్‌ ఖాన్‌

ప్రపంచదేశాల ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే పాకిస్థాన్‌ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖానే స్వయంగా వెల్లడించారు. మంగళవారం ఇస్లామాబాద్‌లోని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ రెవెన్యూలో ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌ సిస్టమ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రస్తావించారు.

8.ఆసియా అగ్రాసనం అదానీకి


రోజుకు రూ.1000 కోట్లు సంపాదిస్తే.. అలా ఏడాదంతా కనకవర్షం కురిస్తే.. అది కూడా ఒక్క వ్యక్తి సాధిస్తే, ఆయనే అదానీ అవుతారు. ఆసియాలోనే అత్యంత సంపన్నుడుగా గౌతమ్‌ అదానీ నిలిచినట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ సూచీ వెల్లడిస్తోంది.

9.టెస్టు సవాలుకు సై

కెప్టెన్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, పంత్‌, బుమ్రా, షమి, శార్దూల్‌.. ఇవి న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో తలపడే భారత జట్టులోని ఆటగాళ్ల పేర్లు కాదు. ఈ మ్యాచ్‌కు దూరమైన క్రికెటర్ల జాబితా ఇది. ఇంత మంది కీలక ఆటగాళ్లు అందుబాటులో లేనప్పటికీ.. జట్టులో అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. సొంతగడ్డే బలంగా, కుర్రాళ్లపై నమ్మకంతో ప్రత్యర్థిని దీటుగా ఎదుర్కొనేందుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది.

10.అలలపై అందాల నగరం

సముద్రమట్టాలు పెరుగుతుండటంతో భవిష్యత్తులో సంభవించే వరదల వంటి ముప్పుల నుంచి రక్షించుకునేందుకుగాను నీటి ఉపరితలంపైనే జనావాసాలను సృష్టించే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోకెల్లా తొలిసారిగా దక్షిణ కొరియాలోని బూసాన్‌ నగర తీరంలో నీటిపై తేలియాడే నగరాన్ని నిర్మించనున్నారు.

Post a Comment

أحدث أقدم