సామాజిక మాధ్యమాల్లో వలపు వలతో మోసాలకు పాల్పడిన యువతి
నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: సామాజిక మాధ్యమాల వేదికగా మోసాలకు పాల్పడుతున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పంతంగి మహేశ్వరి అలియాస్ ధరణిరెడ్డిని నల్గొండ వన్‌టౌన్, మహిళా పోలీస్‌స్టేషన్ సిబ్బంది శనివారం అరెస్టు చేసినట్లు ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలిపారు. మహేశ్వరి కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల ద్వారా వలపు వల విసురుతూ డబ్బులు దండుకోవడంతో పాటు పెళ్లి సంబంధాల పేరిట పలువురిని మోసం చేసిందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ కొంపల్లికి చెందిన బొమ్మెల వెంకటేశ్‌తో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకుంది. అతనితో అభ్యంతరకర రీతిలో వీడియో ఛాటింగ్ చేసి.. మూడు నెలలుగా అడిగినంత డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడిందని వివరించారు. కొందరు యువతులకు పెళ్లి సంబంధాలు చూపిస్తానని మాయమాటలు చెప్పి.. వారి తల్లిదండ్రుల నుంచి ఫీజు రూపంలో డబ్బు రాబట్టి మోసాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. పలువురు బాధితుల నుంచి ఇటీవల రూ.11.70 లక్షలు వసూలు చేసిందన్నారు. నల్గొండ వన్‌టౌన్ పరిధిలో నివాసం ఉంటున్న ఆమెను శనివారం అదుపులోకి తీసుకుని విచారణ చేసినట్లు తెలిపారు. మహేశ్వరిపై కూకట్‌పల్లి, ఘట్‌కేసర్, ఖమ్మం, సత్తుపల్లి, వేంసూరు పోలీస్‌స్టేషన్లతో పాటు కరీంనగర్, షీ టీం, గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదైనట్లు ఎస్పీ వివరించారు.