ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలురేపటి నుంచి 2వారాలపాటు అమలు

APలో పగటి కర్ఫ్యూ

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలు
రేపటి నుంచి 2వారాలపాటు అమలు
144 సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు..
ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశం


 అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం నుంచి మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రజల దైనందిన అవసరాలు తీరడం, వ్యాపారులకు, ఇతర వర్గాలకు ఇబ్బంది కలగకుండా చూడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ‘‘ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవాలి. ఆ తర్వాత కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఈ సమయంలోనూ 144వ సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. అంటే అయిదుగురికి మించి ఒకేచోట గుమిగూడకూడదు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ ఆంక్షలు రెండు వారాలపాటు అమల్లో ఉంటాయి....’’ అని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటికే రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలవుతోంది. ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణ పరిస్థితులపై మంత్రులు, ఉన్నతాధికారులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ‘‘కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారి ప్రాథమిక కాంట్రాక్టును గుర్తించి వారికీ పక్కాగా పరీక్షలు నిర్వహించాలి. ప్రభుత్వం ఎంప్యానెల్‌ జాబితాలో ఉన్న ఆస్పత్రుల్లోనూ వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది కొరత లేకుండా చూడాలి.. దిగుమతి చేసుకున్న ఆక్సిజన్‌ను నిల్వ చేసుకునేందుకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలి....’’ అని సీఎం జగన్‌ ఆదేశించారు. రాష్ట్రంలోని పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఆక్సిజన్‌ కోటా పెంచాలి
రాష్ట్రానికి 480 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కేటాయించగా చాలినన్ని ట్యాంకర్లు లేక 448 మెట్రిక్‌ టన్నులే తీసుకుంటున్నారు. ఆక్సిజన్‌ రవాణాకే కాదు నిల్వ కోసమూ మరిన్ని ట్యాంకర్లు అవసరం ఉంది. ప్రస్తుతం రోజుకు సగటున 420 నుంచి 500 మెట్రిక్‌ టన్నుల వరకు ఆక్సిజన్‌ వినియోగిస్తుండగా మే రెండో వారం చివరి నాటికి ఈ డిమాండ్‌ రెట్టింపు అవుతుందని అంచనా. రాష్ట్రంలో ఆక్సిజన్‌ వసతి ఉన్న ఆస్పత్రులు 146. వాటిలో పైపుల ద్వారా ఆక్సిజన్‌ అందుబాటులో ఉన్న పడకలు 26,446. రాష్ట్రానికి ఆక్సిజన్‌ కోటా పెంచాలని అధికారులు కేంద్రాన్ని కోరారు. రవాణాకువాహనాలూ కావాలని అడిగారు.రాష్ట్రంలో కొత్తగా మైలాన్‌ ల్యాబ్‌ నుంచి ఎనిమిది లక్షల రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్‌95 మాస్కులు 5,67,844, పీపీఈలు 7,66,732, సర్జికల్‌ మాస్కులు 35,46,100, హోం ఐసోలేషన్‌ కిట్లు 2,04,960 మేరకు నిల్వలు ఉన్నాయి.

లక్ష మందికి పైగా హోం ఐసొలేషన్‌
రాష్ట్రంలో 558 కొవిడ్‌ ఆస్పత్రులు ఉన్నాయి. ప్రస్తుతం 3,597 మంది వెంటిలేటర్లపై ఉన్నారు. 37,760 మంది చికిత్స పొందుతున్నారు. 1,01,240 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. కొవిడ్‌ ఆస్పత్రుల్లో 44,599 పడకలు ఉన్నాయి. ఇంతవరకు 1,66,02,873 మందికి కరోనా పరీక్షలు చేశారు. 81 కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 41,780 పడకలు ఉన్నాయి. ఇక్కడ మే 2 వరకు 9,973 మంది చికిత్స పొందుతున్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతంసవాంగ్‌, కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రత్యేకాధికారి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎ.కె.సింఘాల్‌, టాస్క్‌ఫోర్సు కమిటీ ఛైర్మన్‌ ఎం.టి. కృష్ణబాబు, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, 104 సేవల విభాగం ఇన్‌ఛార్జి ఎ.బాబు, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌, ఆర్థికశాఖ కార్యదర్శి నటరాజన్‌ గుల్జార్‌, ఆరోగ్యశ్రీ సీఈవో మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post