దేశ రాజధానిలో మృత్యుఘోష!రికార్డు స్థాయిలో రోజువారీ మరణాలు


Delhi Corona: దేశ రాజధానిలో మృత్యుఘోష!

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి దేశ రాజధాని దిల్లీ వణికిపోతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కొవిడ్‌ (Covid) మరణాలు సంభవిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే అక్కడ అత్యధికంగా 380 మంది కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఒకేరోజు వ్యవధిలో ఇంత మంది చనిపోవడం ఇదే తొలిసారని దిల్లీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో దిల్లీలో కొవిడ్ మృతుల అంత్యక్రియలు నిర్వహించడానికి శ్మశాన వాటికలు సరిపోవడం లేదంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

5 రోజులుగా రికార్డుస్థాయిలో మరణాలు..

దిల్లీలో కరోనా (Corona) మరణాల సంఖ్య కలవరపెడుతోంది. గడిచిన ఐదు రోజులుగా అక్కడ నిత్యం 300లకు పైగా కొవిడ్‌ మరణాలు రికార్డవుతున్నాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 380మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు (ఆదివారం) 350 మంది చనిపోగా, శనివారం 357 మంది మృత్యువాతపడ్డారు. ఇలా ఇప్పటివరకు దిల్లీలో కరోనాతో మరణించిన వారిసంఖ్య 14,628కి చేరింది.

అంత్యక్రియలకు కటకట..

రోజురోజుకి కరోనా మృతుల సంఖ్య పెరిగిపోతుండటంతో దిల్లీలోని శ్మశాన వాటికలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతమున్నవి సరిపోక.. వాటికి పక్కనే ఉండే పార్కులు, పార్కింగ్‌ స్థలాలు, రోడ్డు పక్కనున్న ఖాళీ స్థలాల్లోనూ చితులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి శ్మశాన వాటికలోనూ అన్ని చితులూ నిరంతరం కాలుతుండడంతో అంత్యక్రియల కోసం శవాలతో బంధువులు నిరీక్షిస్తున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీలున్నచోట కొత్తగా చితిమంటల వేదికలు నిర్మిస్తున్నారు.

35శాతం దాటిన పాజిటివిటీ రేటు..

దిల్లీలో కరోనా వైరస్‌ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. కర్ఫ్యూ వంటి ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ కరోనా ఉద్ధృతి అదుపులోకి రావడం లేదు. నిత్యం 20వేలకు పైగా కొత్తగా పాజిటివ్‌ (Corona Positivity) కేసులు వెలుగు చూస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 20,201 కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్‌ బారినపడిన వారిసంఖ్య 10లక్షల 47వేలకు చేరింది. ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 35.02శాతానికి చేరింది. గడిచిన ఐదు రోజుల నుంచి అక్కడ నిత్యం పాజిటివిటీ రేటు 30శాతానికి పైగా ఉంటోంది. ప్రస్తుతం నగరంలో 92,358క్రియాశీల కేసులు ఉన్నాయి.

ఆక్సిజన్‌ కొరత..దిల్లీ హైకోర్టు ఆగ్రహం

కొవిడ్‌ మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ.. దిల్లీలోని ఆసుపత్రులు తీవ్ర ఆక్సిజన్‌ కొరత (Oxygen Shortage) ను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్‌ సిలిండర్లను నల్లబజారులో (Black market)లో అమ్ముతున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై దిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్‌ను బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారిని తమ ముందుకు తీసుకురావాలని దిల్లీ ప్రభుత్వానికి సూచించింది. దిల్లీలో నెలకొన్న ఆక్సిజన్‌ సంక్షోభంపై జస్టిస్‌ విపిన్‌ సంఘీ, జస్టిస్‌ రేఖా పల్లీలతో కూడిన ధర్మాసనం సోమవారం నాడు దాదాపు మూడున్నర గంటలపాటు విచారణ జరిపింది. మంగళవారం కూడా దీనిపై విచారణ జరుపుతామన్న ధర్మాసనం.. ఆక్సిజన్‌ రీఫిల్లర్లను కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.

ఇదిలాఉంటే, దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజే కొత్తగా 3లక్షల 23వేల కేసులు బయటపడ్డాయి. మరో 2771 మంది కొవిడ్‌ బాధితులు మృత్యువాతపడ్డారు. దీంతో భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 1,97,894కు చేరింది.

Post a Comment

أحدث أقدم