భారత్ బంద్‌పై జగన్ సర్కార్ డేరింగ్ స్టెప్.. ఈ నెల 26న..!


కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో రైతులు, విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు నిర్వహించ తలపెట్టిన భారత్‌ బంద్‌కు ఏపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

    
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం డేరింగ్ స్టెప్ తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 26వ తేదీన అఖిల భారత సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో రైతులు, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కార్మికులు నిర్వహించ తలపెట్టిన భారత్‌ బంద్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రైతులు, కార్మికులు చేసే ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతిస్తోందని రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

భారత్ బంద్కు జగన్ సర్కారు మద్దతు

ఈ నెల 26న ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడే నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పేర్ని నాని చెప్పారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను సీఎం జగన్‌ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

బంద్‌లో శాంతియుతంగా నిరసన తెలపాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రైతాంగ, ఉక్కు ఉద్యమాలకు తమ మద్దతు ఉంటుదని తెలిపారు. కాగా, భారత్ బంద్‌కు ఇప్పటికే తెలుగు దేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సైతం మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ, జనసేన పార్టీలు మినహా మిగిలిన అన్ని పార్టీలు బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపాయి.

Post a Comment

Previous Post Next Post