హైదరాబాద్: నగర నడి బొడ్డున అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎప్పుడూ రద్దీగా ఉండే కోఠి ఆంధ్రాబ్యాంకు కూడలి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మొదట ఒక దుకాణంలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న మరో ఐదు దుకాణాలకు వ్యాపించాయి. బట్టల షాపులు కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. షాపులు మూసివేసిన యజమానులు ఇంటికి వెళ్లిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. దుకాణాల్లో బట్టలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న దుకాణ యజమానులు ఘటనా స్థలికి చేరుకుని అగ్నికి ఆహుతువుతున్న షాపులను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఒక దశలో దుకాణాల్లోకి వెళ్లి బట్టలను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
గత 40 ఏళ్లుగా బట్టల దుకాణాలు ఏర్పాటు చేసుకొని కోఠిలోనే జీవనం సాగిస్తున్నామని.. అగ్ని ప్రమాదం వల్ల అన్నీ కోల్పోయి రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.లక్షలు వెచ్చించి ఇటీవలే బట్టలు తీసుకువచ్చినట్టు వాపోయారు. ప్రమాదం కారణంగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు ఆంధ్రాబ్యాంకు వైపు రాకుండా పోలీసులు మళ్లించారు. అగ్నిమాపక సిబ్బంది నాలుగు శకటాలతో ఘటనా స్థలికి చేరుకుని సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగాయా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.