ముగిసిన జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్
హైదరాబాద్: జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి అగసారా నందిని అండర్–18 బాలికల విభాగంలో... ఆంధ్రప్రదేశ్ అబ్బాయి యశ్వంత్ కుమార్ అండర్–20 బాలుర విభాగంలో ‘ఉత్తమ అథ్లెట్’ అవార్డులు గెల్చుకున్నారు. అస్సాంలోని గువాహటిలో బుధవారం ఈ పోటీలు ముగిశాయి. నందిని ఈ పోటీల్లో లాంగ్‌జంప్, 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన యశ్వంత్ అండర్–20 బాలుర 110 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు. తెలంగాణ మొత్తం మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి ఎనిమిది పతకాలతో 12వ ర్యాంక్‌లో... ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఐదు పతకాలతో 15వ ర్యాంక్‌లో నిలిచాయి.
అనికేత్, దీప్తిలకు రజతాలు
చాంపియన్‌షిప్ చివరి రోజు తెలుగు రాష్ట్రాల అథ్లెట్ల ఖాతాలో మరో మూడు పతకాలు చేరాయి. అండర్–18 బాలుర 200 మీటర్లలో అనికేత్ చౌదరి (తెలంగాణ–21.71 సెకన్లు) రజతం సొంతం చేసుకున్నాడు. అండర్–18 బాలికల 200 మీటర్ల లో దీప్తి (తెలంగాణ–24.67 సెకన్లు) కూడా రజత పతకం సాధించింది. అండర్–20 బాలుర 200 మీటర్లలో ఎన్. షణ్ముగ శ్రీనివాస్ (ఆంధ్రప్రదేశ్ –21.60 సెకన్లు) కాంస్యం గెలిచాడు.