పోలీసులకు పట్టించిన ఫోన్‌ సంభాషణ

హత్య కేసు దర్యాప్తుపై కుమార్‌తో వాకబు ఆ కదలికల ఆధారంగానే గాలింపు


హైదరాబాద్‌: జంట హత్యల కేసు నిందితులు కుంట శ్రీనివాస్‌, చిరంజీవిని పట్టుకోవడంలో పోలీసులకు కొత్త సిమ్‌కార్డు సహకరించింది. నిందితుల కాల్‌డేటా ద్వారా కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. హత్యోదంతానికి ముందు వామన్‌రావు కదలికల గురించి కుంట శ్రీనివాస్‌కు, మరో నిందితుడు అక్కపాక కుమార్‌కు మధ్య పలుమార్లు సంభాషణలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం 12.02 నుంచి 12.30 మధ్యలో 10 సార్లు వారు మాట్లాడుకున్నట్లు తేలింది. కొంతసేపటి తర్వాత నిందితులిద్దరూ సెల్‌ఫోన్లు స్విచ్‌ఆఫ్‌ చేసుకున్నారు. నేరస్థలి నుంచి పారిపోయాక కుంట శ్రీనివాస్‌ కొత్త సిమ్‌కార్డును వినియోగించి కుమార్‌తో టచ్‌లో ఉన్నాడు. పోలీసుల దర్యాప్తు తీరు గురించి తెలుసుకుంటూ ఉన్నాడు. ఈలోగా పోలీసులు మృతుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా కుమార్‌ను అదుపులోకి తీసుకొన్నారు. ఆ విషయం తెలియని కుంట శ్రీనివాస్‌.. కుమార్‌తో ఫోన్‌లోనే మాట్లాడుతూనే ఉన్నాడు. దీంతో అతడి కదలికల ఆధారంగా మహారాష్ట్ర పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి వాంకిడిలో నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

అంతా బిట్టు శ్రీనుకే తెలుసు..
పోలీసులకు చిక్కిన అనంతరం కుంట శ్రీను ఈ హత్యల గురించి అంతా బిట్టు శ్రీనుకే తెలుసని చెప్పినట్లు తెలుస్తోంది. స్వగ్రామంలోని వివాదాలతోనే వామన్‌రావును అంతమొందించేందుకు కుట్ర పన్నినట్లు తొలుత చెప్పిన కుంట శ్రీనివాస్‌.. తర్వాత మాత్రం బిట్టు శ్రీను పేరు చెప్పినట్లు సమాచారం.

Post a Comment

أحدث أقدم