ఇంకెన్నాళ్లని

ఇంకని కన్నీళ్లతో

ఇంకని కన్నీళ్లతో.. ఇంకెన్నాళ్లని

ప్రవల్లిక

మల్కాజిగిరి, రాంనగర్‌, న్యూస్‌టుడే: ఉన్నత విద్యనభ్యసించాలని ఆ యువతి ఆశపడింది.. పేదరికం ఆ ఆశలు చిదిమేసింది. నెరవేరని లక్ష్యాన్ని పదేపదే గుర్తు చేసుకొని.. బతుకు వ్యర్థమని భావించింది. మరో ఘటనలో భర్త మరణించినా, కుమారుడి భవిష్యత్తు కోసం భార్య ప్రైవేటు కంపెనీలో చేరింది. ఆర్థిక ఇబ్బందులకు అనారోగ్యం తోడవడంతో బలవన్మరణానికి పాల్పడింది. వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఈ ఘటనలు పోలీసుల కథనం ప్రకారం..
మల్కాజిగిరి ఠాణా పరిధిలోని శారదానగర్‌లో నివసిస్తున్న బ్రహ్మజీ, కామేశ్వరి దంపతులకు మురళీకృష్ణ, ప్రవల్లిక(18) సంతానం. ప్రవల్లిక ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతోంది. తండ్రి పౌరోహిత్యం చేస్తారు. తల్లి వంట పని చేస్తూ ఆసరాగా ఉంటోంది. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేయాలన్నది కుమార్తె కల. పేదరికం కారణంగా ఆ కోర్సు చదవలేనని బాధపడేది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.  
ముషీరాబాద్‌ ఠాణా పరిధి వైఎస్సార్‌ పార్కు సమీపంలో సుజాత(45), కొడుకు మణికంఠతో కలిసి ఉంటోంది. భర్త భాస్కర్‌ అనారోగ్యంతో చనిపోయారు. ఓ ప్రైవేటు కంపెనీలో పనికి చేరింది. ఆర్థిక ఇబ్బందులకు తోడు 15 రోజులుగా అనారోగ్యం బాధిస్తోంది. ఆదివారం కొడుకు బంధువుల ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం ఫ్యానుకు చీరతో ఉరేసుకుంది. మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసిన కుమారుడి రోదనలు మిన్నంటాయి.

Post a Comment

أحدث أقدم