దిల్లీలో నలుగురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
నారాయణగూడ, న్యూస్‌టుడే: సైబర్ దొంగలకు బ్యాంక్ ఖాతాలు అద్దెకిచ్చిన నలుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం దిల్లీలో అరెస్టు చేశారు. 2019లో నగరానికి చెందిన ఓ వ్యక్తిని రూ.13 లక్షలు మోసం చేసిన కేసులో వీరు నిందితులుగా ఉన్నారు. ముందుగా ఫేస్‌బుక్‌లో పరిచయమై, ఛాటింగ్ చేస్తారు. తనకు పెద్ద కంపెనీ, రూ.కోట్ల టర్నోవర్ ఉందని నమ్మిస్తారు. సమాజానికి సేవ చేయాలని అవతలి వ్యక్తిని ముగ్గులోకి దింపుతారు. ట్రస్ట్ ప్రారంభించి పేదలకు తనవంతుగా సేవ చేయాలని, దానికి మీ సహకారం కావాలని అభ్యర్థిస్తారు. మన స్నేహానికి గుర్తుకు విలువైన బహుమతి పంపిస్తాను అని కొందరికి.. సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు చేయడానికి డబ్బు పంపిస్తున్నానని మరికొందరికి మాయామాటలు చెబుతారు. వారే దిల్లీ విమానాశ్రయం నుంచి కస్టమ్స్ అధికారులమంటూ ఫోన్ చేసి బహుమతి పార్శిల్ వచ్చిందని నమ్మబలుకుతారు. కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీ, ఇన్‌కంటాక్స్ అంటూ రకరకాల కారణాలు చెప్పి డబ్బులు దండుకుంటారు. ఇలాగే 2019లో నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.13 లక్షలు దోచేశారు. లాక్‌డౌన్ వల్ల దొంగలను పట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడిప్పుడే సైబర్ క్రైం పోలీసులు దొంగల వేట మొదలుపెట్టారు. బ్యాంక్ ఖాతాల ఆధారంగా నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా.. వారంతా నైజీరియన్లు దోచిన డబ్బును దాచుకోవడానికి తమ బ్యాంక్ ఖాతాలను అద్దెకిచ్చినట్లుగా అంగీకరించినట్లుగా తెలిసింది.