మహేశ్‌బాబు అభిమానులకు ఓ త్రిబుల్ ధమాకా వార్త. ఆ విశేషాలేంటంటే... రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ సినిమా కథాంశం గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా అడవుల్లో సాగే యాక్షన్ అడ్వెంచర్‌గా ఉండనుందట. ఆఫ్రికన్ అడవుల్లో చిత్రీకరణ జరిపే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్‌ను లాక్ చేసే పనిలో ఉన్నారు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. 2022లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లొచ్చు.
రాముడిగా మహేశ్?
రామాయణ ఇతివృత్తం ఆధారంగా హిందీలో భారీ బడ్జెట్‌తో అల్లు అరవింద్, మధు మంతెన ఓ సినిమా నిర్మించనున్నారు. ‘దంగల్’ దర్శకుడు నితీష్ తివారీ, ‘మామ్’ దర్శకుడు రవి ఉడయార్ డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాలో రాముడి పాత్రలో మహేశ్ కనిపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. రావణుడి పాత్రలో హిందీ నటుడు హృతిక్ రోషన్, సీతగా దీపికా పదుకోన్ కనిపిస్తారట. మూడు భాగాలుగా ఈ సినిమాను సుమారు 1500 వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు.
ఎప్పటికీ ఇలానే ఉందాం
మహేశ్ బాబు, నమ్రతకు పెళ్లయి బుధవారానికి 16 సంవత్సరాలు నిండాయి. 2005, ఫిబ్రవరి 10న ఈ ఇద్దరూ వివాహం చేసుకున్నారు. 16వ వెడ్డింగ్ యానివర్సరీను దుబాయ్‌లో జరుపుకుంది ఈ జంట. ‘‘హ్యాపీ 16 నమ్రత. ఎప్పటికీ ఇలానే ఉందాం’’ అంటూ ఓ ఫొటోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు మహేశ్. ‘‘ప్రేమ, నమ్మకం, విశ్వాసం– ఈ మూడూ మా అద్భుతమైన ప్రయాణానికి రెసిపీ’’ అన్నారు నమ్రత.