డబ్బు ఆశ నరబలికి యత్నం


డబ్బు కోసం ఆరుగురి కుట్ర యువతితో పూజ చేయిస్తామని తల్లికి రూ.20 లక్షలు, బంగారం ఎర యువతి తల్లి ఫిర్యాదుతో రంగంలోకి పెద్దపల్లి పోలీసులు వివరాలు వెల్లడించినడీసీపీ రవీందర్

పెద్దపల్లి: డబ్బు కోసం క్షుద్రపూజలు నిర్వహించి ఓ యువతిని బలి ఇచ్చేందుకు కుట్ర పన్నిన వ్యక్తులను పెద్దపల్లి పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఆరుగురు సభ్యుల బృందంలో నలుగురిని అరెస్ట్‌ చేయగా,మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పెద్దపల్లి డీసీపీ రవీందర్‌ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన బండ తిరుపతికి బాగా ఆస్తి పాస్తులు ఉండడంతో అతడి నుంచి డబ్బులు రాబట్టేందుకు.. క్షుద్రపూజలు చేస్తే ఇంకా బాగా సంపాదించవచ్చని అతడి స్నేహితుడు ఆరేపల్లి రాజేందర్‌ సలహా ఇచ్చాడు. మహారాష్ట్రలోని బాబాలు పూజలు చేస్తారని, నరబలి ఇస్తారని తెలిపాడు. రాజేందర్‌ మాటలు నమ్మిన తిరుపతి క్షుద్ర పూజలకు అంగీకరించాడు. దీంతో రాజేందర్‌ తన స్నేహితులైన చందపల్లికి చెందిన ఆర్‌ఎంపీ ఉప్పు కుమార్, అదే గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి మంతెన శ్రీనివాస్‌ను సంప్రదించాడు. బండ తిరుపతి నుంచి డబ్బులు రాబట్టే పథకాన్ని వారికి వివరించాడు. తర్వాత నలుగురూ కలసి క్షుద్రపూజలకు ఏర్పాట్లు చేపట్టారు. 

మహారాష్ట్రలోని బాబాతో సంప్రదింపులు..
క్షుద్ర పూజల కోసం రాజేందర్‌ మహారాష్ట్రకు చెందిన బాబా రమేశ్‌చావ్లాదేవ్‌ను సంప్రదించాడు. పూజలకు ఇద్దరు మహిళలు, ఒక అవివాహిత యువతి కావాలని అతను తిరుపతికి సూచించాడు. వారిని చీకటిగదిలో కూర్చోబెట్టి పూజ చేస్తే కనక వర్షం కురుస్తుందని నమ్మించాడు. దీంతో బండ తిరుపతి ఇందుకు ఏర్పాటు చేయాలని రాజేందర్, కుమార్, శ్రీనివాస్‌కు సూచించాడు. 

ఆర్‌ఎంపీ కీలకపాత్ర.. 
ఆర్‌ఎంపీ కుమార్‌ క్షుద్ర పూజల కోసం చందపల్లికి చెందిన తొగరి సరిత, భూతం మల్లమ్మను సంప్రదించాడు. ఈ అమావాస్య రోజు మహా రాష్ట్రకు చెందిన బాబా నిర్వహించే పూజల్లో పాల్గొంటే రూ.2 లక్షల చొప్పున ఇస్తామని నమ్మిం చాడు. మరో పెళ్లికాని యువతిని తీసుకురావాలని సూచించారు. ఆమెకు రూ.20 లక్షలు, బంగారం ఇస్తామని తెలిపాడు. దీంతో తొగరి సరిత, భూతం మల్లమ్మ చందంపల్లికే చెందిన ఆర్కుటి సరితను సంప్రదించారు. అమావాస్య రోజు పూజలు నిర్వహించేందుకు ఆమె కూతురును పంపించాలని కోరారు. ఇందుకు రూ.20 లక్షల నగదు, బంగారం ఇప్పిస్తామని తెలిపారు. 

మొదట అంగీకారం.. అనుమానంతో ఫిర్యాదు 
డబ్బు, బంగారంపై ఆశతో ఆర్కుటి సరిత తన కూతురు (20)ని క్షుద్ర పూజలకు పంపించేందుకు మొదట అంగీకరించింది. ఈ విషయాన్ని కూతురుకు కూడా చెప్పింది. ఈ క్రమంలో త్వరగా డబ్బు, బంగారం ఇవ్వాలని తొగరి సరిత, భూతం మల్లమ్మతోపాటు ఆర్‌ఎంపీ కుమార్‌పై ఒత్తిడి తెచ్చింది. అయితే డబ్బులు చెల్లించకపోవడం, అమావాస్యనాటికి కూతురును సిద్ధం చేయాలని వారు ఆర్కుటి సరితపై ఒత్తిడి తేవడంతో పూజలో నరబలి కూడా ఉంటుందని ఆమెకు అనుమానం కలిగింది. దీంతో విషయాన్ని తన భర్తకు చెప్పింది. వారు కుమార్‌ను నిలదీయడంతో విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించాడు. దాంతో తమ కూతురు ప్రాణాలకు ముప్పు ఉందన్న అనుమానంతో ఆర్కుటి సరిత, ఆమె భర్త ఈ నెల 8న పెద్దపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వలపన్ని పట్టుకున్న పోలీసులు..
పెద్దపల్లి డీసీపీ రవీందర్, ఎస్సై రాజేశ్‌ నిందితు లను పట్టుకునేందుకు పక్కా ప్రణాళిక రూపొందిం చారు. నిందితులకు అనుమానం రాకుండా వారిపై నిఘా ఉంచారు. ఎస్సై రాజేశ్‌ బుధవారం సిబ్బందితో వెళ్లి ఆరెపల్లి రాజేందర్, మంతెన శ్రీనివాస్, బండ తిరుపతి, ఉప్పు కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. తొగరి సరిత, భూతం మల్లమ్మ పరారీలో ఉన్నారు. నిందితులను డీసీపీ కార్యాలయంలో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంద ర్భంగా డీసీపీ మాట్లాడుతూ ప్రజల అమాయ కత్వం, ఆర్థిక పరిస్థితులు, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని కొంతమంది ఇలాంటి మోసా లకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్షుద్ర పూజలు చేస్తే సంపద కలుగుతుందనే అభూత కల్పనను నమ్మవద్దని పేర్కొన్నారు. క్షుద్రపూజలు, నరబలి జరగకుండా ముందస్తుగా నిందితులను పట్టుకున్న ఎస్సై రాజేశ్, పోలీస్‌ సిబ్బందిని డీసీపీ అభినందించారు.

Post a Comment

أحدث أقدم