80 అడుగుల లోయలో పడిన టూరిస్టు బస్సు చిన్నారి సహా నలుగురి దుర్మరణం 22 మందికి తీవ్ర గాయాలు
విశాఖ జిల్లా అరకులోయ వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. పర్యాటకులతో కూడిన బస్సు 80 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లి పడిపోవడంతో చిన్నారి సహా నలుగురు చనిపోయారు. మృతులు, క్షతగాత్రులు అందరూ హైదరాబాద్‌లోని షేక్‌పేట ప్రాంతానికి చెందినవారు. తీర్థయాత్రలు ముగించుకుని అరకు వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
మా పాప ఎక్కడ?
తీవ్రంగా గాయపడిన మౌనికకు తన 8నెలల కుమార్తె శ్రీనిత్య చనిపోయిన విషయం తెలియదు. ఎస్.కోట ఆసుపత్రిలో చికిత్స పొంది స్పృహలోకి వచ్చాక ‘అందరూ కనిపిస్తున్నారు.. నా కూతురు ఎక్కడుందో చెప్పండ’ని కుటుంబీకులను అడగడం చూపరులను కలచివేసింది.
మృతులంతా హైదరాబాద్ వాసులే
హైదరాబాద్, న్యూస్‌టుడే, రాయదుర్గం, గోల్కొండ: ఆధ్యాత్మిక, విహారయాత్ర నాలుగు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. బయలుదేరే ముందు అందరూ ఫొటోలు దిగుతూ ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. రోజుల వ్యవధిలోనే బస్సు ప్రమాదానికి గురికావడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రమాద సమాచారం పూర్తిగా తెలియక నగరంలోని బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. రిజర్వ్‌బ్యాంకు అధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందిన కొట్టం సత్యనారాయణ షేక్‌పేటలో నివసిస్తున్నారు. ఆయనకు వరసయ్యే సోదరులు నరసింహారావు, పాండులు కూడా అక్కడే ఉంటున్నారు. మరో ఇద్దరు సోదరులు మణికొండలోని పంచవటి కాలనీలో ఉన్నారు. నరసింహారావు, పాండు, సత్యనారాయణ కుటుంబాల్లో మొత్తం 300 మంది ఉన్నారు. చిన్నవేడుక జరిగినా సరే.. మొత్తం 300మంది హాజరవ్వాల్సిందే. ఐదుగురు సోదరుల పిల్లల్లో కొందరు ప్రైవేటు ఉద్యోగాలు, మరికొందరు వ్యాపారాలు చేస్తున్నారు. కొవిడ్ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకూ వీరు ఎక్కడికీ వెళ్లలేదు. విజయవాడ, వైజాగ్‌కు వెళ్దామంటూ నరసింహారావు ప్రతిపాదించగా..పాండు, సత్యనారాయణ కుటుంబీకులు అంగీకరించారు.
మృతుల కుటుంబాలను ఆదుకోండి..
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని మృతుల బంధువు కొట్టం కృష్ణ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అభ్యర్థించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలంగాణ గవర్నర్ తమిళిసై, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు కేసీఆర్, జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సానుభూతి తెలిపారు. సరైన వైద్యమందించాలని కోరారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అండ[గా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఫోన్ చేసి పరామర్శించారు.