హైద‌రాబాద్ రీజిన‌ల్ రింగ్ రోడ్డుకు కేంద్రం ఆమోదం



హైద‌రాబాద్ రీజిన‌ల్ రింగ్ రోడ్డుకు కేంద్రం ఆమోదం

కోదాడ-ఖమ్మం మధ్య నాలుగులేన్ల జాతీయ రహదారి
టెండర్లు పిలవడానికి అంగీకారం
ఎంపీ నామాకు నిర్ణయాన్ని తెలిపిన గడ్కరీ
కేంద్ర మంత్రిని కలిసిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కోదాడ- ఖమ్మం మధ్య నాలుగు లేన్ల జాతీయ రహదారితోపాటు పలు పెండింగ్‌ ప్రాజెక్టులకు కూడా పచ్చజెండా ఊపింది. త్వరలో కోదాడ-ఖమ్మం జాతీయ రహదారి పనులకు టెండర్లు పిలవడానికి అంగీకరించింది.


  • 354 km  హైదరాబాద్‌ చుట్టూ రీజినల్‌ రింగ్‌ రోడ్డు మొత్తం పొడవు 
  • 50% ప్రాజెక్టు వ్యయంలో సగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.

1. మొదటి దశ: సంగారెడ్డి నుంచి తూప్రాన్‌ మీదుగా చౌటుప్పల్‌వరకు 

2. రెండో దశ: చౌటుప్పల్‌-షాద్‌నగర్‌ మీదుగా కంది  వరకు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 : రీజినల్‌ రింగ్‌రోడ్డు నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిందని కేంద్ర ఉపరితల రవాణశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారని టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత నామానాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పెండింగ్‌ ప్రాజెక్టులకు అనుమతివ్వాలని కోరుతూ తాను, ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్‌, మన్నె శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కలువగా, ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ చుట్టూ 354 కిలోమీటర్ల పొడవున ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రతిపాదించిన విషయాన్ని నామా ఈ సందర్భంగా కేంద్రమంత్రికి వివరించారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు కోసం సీఎం కేసీఆర్‌ పలు విడతలుగా కేంద్రానికి లేఖలు రాశారని చెప్పారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌ మహానగరం మరింత అభివృద్ధిపథంలో పయనిస్తుందని, పారిశ్రామికంగా పురోగమిస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఎంతో దూరదృష్టితో ఆలోచించి ఆర్‌ఆర్‌ఆర్‌కు రూపకల్పన చేశారని పేర్కొన్నారు. 2017లో సంగారెడ్డి నుంచి తూప్రాన్‌ మీదుగా చౌటుప్పల్‌వరకు మొదటిదశలో నిర్మించే జాతీయ రహదారికి ఎన్‌హెచ్‌161ఏఏగా నంబర్‌ కేటాయించారని, దీనిని 166 కిలోమీటర్ల వరకు నిర్మించేందుకు కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిందని నామా కేంద్రమంత్రి గడ్కరీకి తెలిపారు. రెండో దశలో చౌటుప్పల్‌-షాద్‌నగర్‌ మీదుగా కంది వరకు నిర్మించే 182 కిలోమీటర్ల రహదారి ప్రాజెక్టును జాతీయ రహదారిగా గుర్తిస్తూ నోటిఫికేషన్‌ ఇవ్వాలని కేంద్ర రోడ్లు, రవాణా మంత్రిత్వశాఖకు నివేదికలు సమర్పించామని తెలిపారు. 2018 జనవరి 27, ఆగస్టు 27న ఇచ్చిన అలైన్‌మెంట్లను ఆమోదించాలని కోరారు. ఈ రోడ్డు నిర్మాణానికి అయ్యే వ్యయంలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు కేంద్ర మంత్రికి నామా తెలియజేశారు. నాగపూర్‌-హైదరాబాద్‌- బెంగళూరు కారిడార్‌, పుణె-హైదరాబాద్‌- విజయవాడ కారిడార్‌లో జాతీయ రహదారి కనెక్టివిటీ ప్రాముఖ్యత పెరుగుతుందని నామా తెలిపారు. అలాగే హైదరాబాద్‌ చుట్టుపక్కల వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు ఆర్‌ఆర్‌ఆర్‌ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.


కోదాడ-ఖమ్మం  నాలుగు లైన్ల రహదారి

 కోదాడ-ఖమ్మం నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని నామా నాగేశ్వర్‌రావు తెలిపారు. భారత్‌మాల పరియోజన పథకం కింద 31.80 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించనున్నారని చెప్పారు. ఈ రహదారిని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ తెలిపారని నామా పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన భూసేకరణ చేశామని, త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారన్నారు. విభజన చట్టం హామీలలో భాగంగా రాష్ట్రంలో ప్రతిపాదిత జాతీయ రహదారులను, ఇతర పెండింగ్‌ రహదారులను త్వరితగతిన పూర్తిచేసేందుకు గడ్కరీ సానుకూలత వ్యక్తం చేశారని తెలిపారు. ఎన్‌హెచ్‌167 అలీనగర్‌ 157.707 కిలోమీటర్‌ నుంచి 87.723 కిలోమీటర్‌ మిర్యాలగూడవరకు రోడ్డు విస్తరణ కోసం కేంద్రం రూ. 220 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. రెండు లైన్ల మిర్యాలగూడ రహదారిని నాలుగులైన్ల రహదారిగా విస్తరిస్తే రూ.65నుంచి రూ.70 కోట్ల అదనపు ఖర్చు అవుతుందని, సమయం, వ్యయం కలిసి వస్తుందని స్థానిక ఎమ్మెల్యే అభిప్రాయాన్ని కేంద్రానికి తెలియజేశామని నామా తెలిపారు.  ప్రస్తుతం 30 మీటర్ల వెడల్పు ఉన్న రహదారి.. ట్రాఫిక్‌ సమస్యలతోపాటు అనేక ప్రమాదాలకు నెలవుగా మారిందని నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి వివరించారు.

Post a Comment

أحدث أقدم