మహమ్మారి మరణ శాసనం


కాలేయ వ్యాధితో తొమ్మిదేళ్ల వయసులో కుమార్తె మృతి తర్వాత మూడేళ్లకు కుమారుడి కన్నుమూత తాజాగా వైద్య విద్య చదువుతున్న కుమార్తెనూ కబళించిన మాయదారి రోగం

మహమ్మారి.. మరణ శాసనం!

ఆదిలాబాద్‌ వైద్య విభాగం, భుక్తాపూర్‌, న్యూస్‌టుడే: చెట్టుకు కాచిన కాయలు రాలిపోతుంటేనే ప్రాణం చివుక్కుమంటుంది. అలాంటిది కడుపున పుట్టిన బిడ్డలు ఒకరితర్వాత ఒకరుగా రాలిపోతుంటే కన్నవాళ్లకు ఎలా ఉంటుంది. అందరూ ఒకే రకమైన వ్యాధితో నరక యాతన అనుభవించి మరీ కడతేరిపోతుంటే వారి గుండె ఎన్ని ముక్కలై ఉంటుంది. కలలో ఇలాంటివి జరిగితేనే కళ్లు చమరుస్తాయి. అచ్చం అలాంటి పరిస్థితే వాస్తవంలో ఓ కుటుంబానికి వచ్చింది. మూడేళ్ల వ్యవధిలో ఇద్దర్ని కబళించిన కాలేయ వ్యాధి, తాజాగా ఎంబీబీఎస్‌ చదువుతున్న మరో కుమార్తెను కాలనాగులా కాటేయడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.
ఆదిలాబాద్‌ పట్టణంలోని వాల్మీకినగర్‌లో నివాసం ఉంటున్న చదల శ్రీనివాస్‌, పద్మ దంపతులకు ముగ్గురు సంతానం. శ్రీనివాస్‌ వ్యవసాయ శాఖలో ఉద్యోగి, ఆయన భార్య గృహిణి. వారి పెద్ద కుమార్తె శ్వేత తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు కాలేయ (లివర్‌ విల్సన్‌ డీసీజ్‌) వ్యాధి బారినపడింది. చివరి దశలో గుర్తించి ఆసుపత్రిలో చికిత్స చేయించినా నయం కాలేదు. 2006లో మరణించింది. తర్వాత మూడేళ్లకు మూడో సంతానమైన కుమారుడు రాము తొమ్మిదేళ్ల వయసులో ఇదే వ్యాధితో మృత్యువాత పడ్డాడు. ఇద్దరు పిల్లల మృతితో కుంగిపోయిన తల్లిదండ్రులు మిగిలిన ఒక్కగానొక్క కుమార్తె వైష్ణవిని కంటికిరెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. చదువులో చురుగ్గా ఉండే వైష్ణవి ప్రస్తుతం ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతోంది. గత ఏడాది ఆగస్టులో ఈమెకూ ఇదే వ్యాధి సోకటంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. ఎలాగైనా బిడ్డను బతికించుకోవాలనే తాపత్రయంతో రూ.లక్షలు అప్పుచేసి మరీ హైదరాబాద్‌లోని ప్రముఖ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. కాలేయ మార్పిడి చికిత్సతో ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు సూచించడంతో డిసెంబరులో తల్లి పద్మ కాలేయ దానానికి ముందుకొచ్చారు. ఆ నెలలోనే శస్త్ర చికిత్స జరిగింది. అప్పట్నుంచి ఆసుపత్రి పర్యవేక్షణలోనే ఉన్న వైష్ణవి శుక్రవారం రాత్రి కన్నుమూయడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. తాము ఇక ఎవరికోసం బతకాలంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. శనివారం జిల్లా కేంద్రంలో కుటుంబ సభ్యులు, కాలనీవాసుల రోదనల మధ్య అంత్యక్రియలు పూర్తిచేశారు.





Post a Comment

Previous Post Next Post