నడిరోడ్డుపై నరికేశారు

న్యాయవాద దంపతుల దారుణ హత్య పట్టపగలే ఘాతుకం కారులో వెంబడించి నరికివేత తెరాస నాయకుడిపై హతుడి తండ్రి ఫిర్యాదు


 పెద్దపల్లి: సెంటినరీ కాలనీ, న్యూస్‌టుడే: నడిరోడ్డు.. అటూ ఇటూ వాహనాలు వెళ్తున్నాయి.. ఇద్దరు న్యాయవాద దంపతులు ఓ కారులో హైకోర్టుకు వెళ్తున్నారు. అంతలో వారి కారును దాటుకుంటూ ముందుకొచ్చి అడ్డంగా ఆగిందొక పెద్దకారు.. అందులోంచి దిగిన దుండగులు ఆ దంపతుల్ని కారులోంచి లాగి దారుణంగా నరికి చంపేశారు. ఈ హఠాత్పరిణామంతో రెండు ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి.. వాటిలోని ప్రయాణికులు భయంతో కేకలు వేశారు.. అటుగా వెళ్తున్న ఇతర వాహనాల్లోనివారు ఆగి రోడ్డు మీద బీభత్సకాండను వీడియో తీశారు.. వచ్చిన దుండగులు తమ పని ముగించుకుని ఎంత వేగంతో వచ్చారో అంతే వేగంతో కారులోనే పరారయ్యారు.

హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు (49), నాగమణి (45) దంపతులను బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై పట్టపగలే నరికి చంపిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. మంథని మండలం గుంజపడుగ గ్రామానికి చెందిన వామన్‌రావు, నాగమణి హైకోర్టులో న్యాయవాదులు. పలువురు రాజకీయ నాయకులు, పోలీసులకు వ్యతిరేకంగా అనేక కేసుల్లో వాదనలు వినిపించడంతో పాటు ఇసుక క్వారీయింగ్‌ వంటి అక్రమాలపై వారు హైకోర్టుకు లేఖలు రాశారు.  బుధవారం ఉదయం 11 గంటలకు వారు కారు డ్రైవర్‌ సతీశ్‌తో కలిసి మంథని వచ్చారు. అక్కడ ఓ కేసుకు సంబంధించి దస్తావేజులు తీసుకున్నారు. మధ్యాహ్నం 1.50 గంటలకు తిరిగి హైదరాబాద్‌ బయల్దేరారు. మంథని నుంచి గుర్తుతెలియని వ్యక్తులు నల్లటి కారులో వీరి వాహనాన్ని వెంబడించారు. కల్వచర్ల సమీపంలో లాయర్‌ కారు ముందు తమ వాహనాన్ని ఆపి అడ్డగించారు. కొబ్బరిబొండాలు నరికే కత్తులతో కారు అద్దాలు పగలగొట్టి వామన్‌రావును కిందకు లాగారు. మెడ, పొట్ట భాగంలో నరికారు. భయంతో కారులోనే ఉండిపోయిన నాగమణి మెడపైనా నరికారు. అప్పటికే రహదారిపై వాహనాలు నిలిచిపోవడం, వాహనదారులు, బస్సుల్లో ఉన్న ప్రయాణికులు అరవడంతో దుండగులు మంథని వైపు పరారయ్యారు. అక్కడున్నవారు 108 సిబ్బందికి సమాచారం అందించారు. అంబులెన్సులో బాధితులను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు.


నడిరోడ్డుపై నరికేశారు

రక్షణ కోరినా దక్కని ప్రాణం
ప్రభుత్వ పథకాల్లో అవినీతి, అక్రమాలపై తరచూ స్పందించడం, వివాదాస్పదంగా మారిన తగాదాలను వృత్తిపరంగా వామన్‌రావు ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని వారే దంపతులను హతమార్చినట్లు తెలుస్తోంది. తమకు ప్రాణహాని ఉందని వారు హైకోర్టుకు విన్నవించుకోగా రక్షణ కల్పించాల్సిందిగా న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ఈ విషయమై ఈ దంపతులు పలుమార్లు రామగుండం సీపీ సత్యనారాయణతో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది.

ఎవరా వ్యక్తి?
పెద్దపల్లి-మంథని మార్గంలో రామగిరి మండలం కల్వచర్ల పెట్రోల్‌ పంపు వద్ద రహదారి పనులు జరుగుతుండటంతో అక్కడ వాహనాలు నెమ్మదిగా వెళ్తుంటాయి. దుండగులు అక్కడ లాయర్‌ వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేశారు. కత్తిపోట్ల అనంతరం రోడ్డుపై పడి ఉన్న వామన్‌రావును స్థానికులు ‘ఎవరు హత్యా యత్నం చేశార’ని ప్రశ్నించగా ‘కుంట శ్రీనివాస్‌’ అనే పేరు చెప్పడం వీడియోలో వినిపిస్తోంది. నిందితులు దాడి అనంతరం వచ్చిన కారులోనే మంథని వైపు వెళ్లారు. అదే కారులో అంతకుముందు మంథనిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. దీంతో హత్యకు పాల్పడింది శ్రీనివాసేనని, గుంజపడుగుకు చెందిన మరో వ్యక్తి కూడా ఇందులో పాల్గొన్నట్లు భావిస్తున్నారు.

నడిరోడ్డుపై నరికేశారు

ఆరు ప్రత్యేక బృందాల ఏర్పాటు
సంఘటనా స్థలాన్ని క్లూస్‌ టీం బృందం పరిశీలించింది. మంథని మండల తెరాస అధ్యక్షుడు కుంట శ్రీనివాస్‌, అతడి అనుచరులు అక్కపాక కుమార్‌, వసంతరావు ప్రోద్బలంతో ఈ హత్యలకు పాల్పడ్డారని వామన్‌రావు తండ్రి కిషన్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ముగ్గురు డీసీపీలతో ఆరు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు రామగుండం సీపీ సత్యనారాయణ చెప్పారు. ఇప్పటికే 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. గుంజపడుగులో ఓ ఇంటి నిర్మాణానికి సంబంధించి వామన్‌రావుకు, నిర్మాణదారులకు మధ్య విభేదాలున్నాయన్నాయని, అన్ని కోణాల్లోనూ విచారిన్నామని చెప్పారు.

నడిరోడ్డుపై నరికేశారు


హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ నిరసన నేడు
న్యాయవాద దంపతుల హత్యకు కారకులైన దోషులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని తెలంగాణ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సంఘటనకు నిరసనగా గురువారం హైకోర్టులో విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. వామన్‌రావు దంపతుల హత్యను తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ తీవ్రంగా ఖండించింది. న్యాయవాదులపై ఇటీవల దాడులు ఎక్కువవుతున్నాయని, వారి రక్షణకు చట్టాన్ని తీసుకురావాలని కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి పేర్కొన్నారు.


Post a Comment

أحدث أقدم