మే 23న కూతురి పెళ్లి.. అంతలోనే జలసమాది


మృతులు జగిత్యాలకు చెందిన అడ్వొకేట్‌ అమరేందర్‌రావు, శిరీష,   శ్రేయ దంపతులు జలసమాధి ప్రాణాలతో బయటపడిన కుమారుడు మృతులు జగిత్యాలకు చెందిన అడ్వొకేట్‌ అమరేందర్‌రావు, శిరీష, శ్రేయ జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట శివారులో ఘటన

 జగిత్యాల/ మేడిపల్లి (వేములవాడ): దైవ దర్శనానికి వేకువజామునే సొంతూరుకు బయల్దేరిన ఓ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించినా తేరుకునే లోపే మృత్యువు కాటేసింది. నీట మునిగి ముగ్గురు కుటుంబసభ్యులు దుర్మరణం చెందారు. ‘‘అమ్మకు ఈత రాదు. అమ్మను తీసుకొని బయటకు వెళ్దాం..’’అని తండ్రి ధైర్యం చెప్పినా... తేరుకొని బయటపడే ప్రయత్నం చేసే లోపే కారులో నీరు నిండిపోయింది. దంపతులు, కూతురు దుర్మరణం చెందగా... కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట శివారులో సోమవారం ఉదయం చోటు చేసుకుంది

వివరాలిలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డుకు చెందిన న్యాయవాది కటికనేని అమరేందర్‌రావు (55), ఆయన భార్య శిరీష (45), కూతురు శ్రేయ (23), కుమారుడు జయంత్‌ కలిసి సోమవారం స్వగ్రామమైన కోరుట్ల మండలం జోగన్‌ పెల్లికి బయల్దేరారు. ఊరిలో సోమవారమే ప్రారంభమైన వేంకటేశ్వరస్వామి ఉత్సవా లకు హాజరయ్యేందుకు తెల్లవారుజామున 5.15 గంటలకు బయల్దేరారు. ఆ తర్వాత 15 నిమిషాలకే కారు అదుపుతప్పి మేడిపల్లి మండలం కట్లకుంట శివారులో రోడ్డు పక్కనున్న ఎస్సారెస్పీ కాలువలో పడిపోయింది.

ఆ సమయంలో అమరేందర్‌రావు కారు నడుపుతుండగా, కుమారుడు జయంత్‌ పక్కన కూర్చున్నాడు. భార్య శిరీష, కూతురు శ్రేయ వెనుక సీట్లో కూర్చున్నారు. కారు కాలువలో పడి సుమారు 20 మీటర్ల దూరం వరకు వెళ్లి మోటారు పైపునకు తట్టుకుని ఆగింది. కుమారుడు జయంత్‌ కారు డోరు తీసు కుని... ఈదుకుంటూ సురక్షితంగా బయట పడినప్పటికీ అమరేందర్‌రావుతో పాటు భార్య శిరీష, కూతురు శ్రేయ కారులో ఇరు క్కుపోవడంతో నీటిలోనే మునిగి మరణిం చారు. స్థానికులు సహాయ చర్యలు చేపట్టినప్పటికీ అప్పటికే ముగ్గురు చనిపోయారు.  


కాలువలో పడ్డ కారును బయటకు తీస్తున్న పోలీసులు

నిద్రమత్తులోనే ప్రమాదం
తెల్లవారుజామునే జగిత్యాల నుంచి బయల్దేరిన కారు మేడిపల్లి మీదుగా కోరుట్ల మండలం జోగిన్‌పల్లికి వెళ్లేమార్గంలో కట్లకుంట వద్దనున్న ఎస్సారెస్పీ కెనాల్‌ బ్రిడ్జి ముందు నుంచే కాలువలోకి దూసుకెళ్లింది. బ్రిడ్జి దగ్గరకు రాగానే నేరుగా బీటీ రోడ్డు వైపు వెళ్లకుండా కుడివైపునకు మళ్లించడంతో అదుపుతప్పి కారు కాల్వలో పడింది. నిద్రమత్తు కారణంగానే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

ముగ్గురికి ఈత వచ్చినా..
కారు కాలువలోకి దూసుకెళ్లగా.. అమరేందర్‌రావు, ఆయన భార్య, పిల్లలు అందులో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ‘‘ఎవరూ కంగారు పడొద్దు. మన ముగ్గురికీ ఈత వస్తుంది.. అమ్మను మెల్లగా బయటకు తీసు కొద్దాం..’’అని అమరేందర్‌రావు పిల్లలకు చెప్పారు. కానీ.. కారు డోర్లు తీయలేక పోవడంతో లోపలే ఇరుక్కుపోయారు. కారులో నీళ్లు నిండుతున్నాయని శిరీష, శ్రేయలు కారు మునిగిపోయే సమయంలో అరిచినట్లు జయంత్‌ చెప్పాడు. 

మూడు నెలల్లో కూతురు పెళ్లి..
ఢిల్లీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్న శ్రేయకు వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌తో ఇటీవలే పెళ్లి కుదిరింది. మే 23న పెళ్లి పెట్టుకున్నారు. సోమవారం జోగిన్‌పల్లిలో దైవ దర్శనం తరువాత హైదరాబాద్‌కు వెళ్లి పెళ్లి పనులు, షాపింగ్‌ పూర్తి చేసుకోవాలని అమరేందర్‌రావు కుటుంబీకులు భావించారు. ఈలోపే ప్రమాదం చోటుచేసుకొని తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జగిత్యాల ఆసుపత్రిలో మృతదే హాలను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, కలెక్టర్‌ రవి, ఎస్పీ సింధుశర్మ పరిశీలించారు.

రెయిలింగ్‌ లేక ప్రమాదాలు
ఐదు రోజుల క్రితం వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలం తీగరాజు పల్లి శివారులో ఎస్సారెస్పీ కాలువలో కారు పడి ఇద్దరు మృతి చెందిన ఘటన మరువకముందే సోమవారం జగి త్యాల జిల్లా కట్లకుంట శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్సా రెస్పీ కెనాల్‌ మీదుగా వెళుతున్న రహదారులపై బ్రిడ్జీలకు ఇరువైపులా సుమారు 100 మీటర్ల వరకు రెయిలింగ్‌ ఏర్పాటు చేయాల్సి ఉండగా రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి 16న కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ శివారులో ఎస్సారెస్పీ ప్రధాన కాలువలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బంధువులు ప్రయాణిస్తున్న కారు కాలువలో పడి ముగ్గురు మృతిచెందారు. ఇక్కడే జనవరి 25న సుల్తానాబాద్‌కు చెందిన దంపతులు కారు రివర్స్‌ తీస్తుండగా ప్రమాదవశాత్తు కాల్వలో పడి ఇద్దరు మృతిచెందారు. ఇదే ప్రాంతంలో వేర్వే రు ఘటనలో రెండు బైక్‌ ప్రమాదాల్లో నలుగురు మరణించారు.

అమ్మను కూడా తీసుకెళ్దాం అన్నారు
‘కారులో బయల్దేరాక నాన్నకు నిద్ర వస్తోందని నేను డ్రైవ్‌ చేస్తానన్నాను. పర్లేదు బిడ్డా... టెన్షన్‌ పడకు నేను నడుపుతా అన్నారు. బ్రిడ్జి వద్దకు రాగానే కారు అదుపుతప్పడంతో కాలువలో పడిపోయింది. వెంటనే నాన్నా కారు నుంచి బయటకు వెళ్దాం అన్నాను. ఏమీ కాదులే.. నీకు, నాకు, అక్కయ్యకు ఈతవచ్చు. అమ్మకు ఈత రాదు కాబట్టి ఆమెను తీసుకొని బయటకు వెళ్దాం అన్నారు. నాన్న ఆ మాట చెప్పేలోపే కారు నీటిలో మునిగిపోయింది. నేను డోరు తీసుకొని బయటకు వచ్చాను. కానీ నాన్న, అమ్మ, అక్క కారులోనే ఇరుక్కుపోయారు. కళ్లముందే అంతా అయిపోయింది

Post a Comment

أحدث أقدم