మహదేవపూర్: నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లిపై ఓ కుమారుడు కర్కశంగా వ్యవహరించాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం సూరారంలో జరిగింది. ఎస్సై అనిల్‌కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బస్వ లచ్చమ్మకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. లచ్చమ్మ భర్త గతంలోనే మృతిచెందగా.. ఉన్న ఆస్తిని కొడుకులు, కూతుళ్లకు సమానంగా పంచి ఇచ్చింది. కాగా, పెద్ద కుమారుడు గతంలో చనిపోగా, రెండో కుమారుడు కొన్నేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మూడో కుమారుడు బస్వ వెంకయ్య స్థానికంగా నివాసం ఉంటున్నాడు. పెద్దన్న వాటాను వెంకయ్య కొనుగోలు చేయడంతో పాటు మరో సోదరుడి వాటా భూమిని అదనంగా తీసుకున్నాడు. సోదరుల ఆస్తులు తీసుకున్న వెంకయ్య.. తల్లిని పట్టించుకోకపోవడంతో ఆమె చిన్న కూతురు (భర్త లేడు) రాజ్యలక్ష్మి పోషిస్తోంది.
రెండేళ్ల క్రితం లచ్చమ్మకు ఫిట్స్ కారణంగా కాలు విరగడంతో కూతురే చికిత్స చేయించింది. అచేతన స్థితిలో ఉన్న తల్లి పోషణ భారంగా మారింది. దీంతో తల్లిని తన సోదరుడు వెంకయ్య పట్టించుకోవడం లేదని రాజ్యలక్ష్మి పోలీస్‌స్టేషన్‌తో పాటు గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసింది. వారు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి తల్లిని పోషించాలని అప్పగించారు. అయితే వెంకయ్య తల్లిని రోజుకోరకంగా హింసిస్తున్నాడు. ఇటీవల లచ్చమ్మ కాళ్లుకు కొర్రాయితో కాల్చి మంచాన పడేశాడు. విషయం తెలుసుకున్న కూతురు రాజ్యలక్ష్మి వరంగల్ ఎంజీఎంకు తరలించింది. పరీక్షించిన వైద్యులు.. ఇన్‌ఫెక్షన్ అయిందని కాలు తొలగించాలని చెప్పారు. దీంతో ఏమి చేయాలో తోచక తల్లిని స్వగ్రామానికి తీసుకొచ్చిన రాజ్యలక్ష్మి.. పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేసింది.