షెడ్డు కూలి 23 మంది దుర్మరణం.. 15 మందికి గాయాలు
యూపీలో అంత్యక్రియల వేళ ఘోర ప్రమాదం
గాజియాబాద్: బంధువు అంత్యక్రియలు ఇంకా ముగియనేలేదు. చితి మంటలు ఆరనేలేదు. అయినవారు శ్మశానం వీడనేలేదు. అంతలోనే కనికరం లేని మృత్యువు ప్రమాదం రూపంలో కబళించింది. 23 మందిని నిర్దాక్షిణ్యంగా బలితీసుకుని దుఃఖాన్ని అనంతం చేసింది. మరో 15మందిని తీవ్ర గాయాలపాలు చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ శ్మశానంలో ఆదివారం జరిగిన ఈ దుర్ఘటన వివరాలివీ.. గాజియాబాద్‌లోని మురద్‌నగర్ సమీపంలో ఉన్న ఉఖ్లర్సి గ్రామంలో జైరాం అనే వ్యక్తి మరణించాడు. అతడి కుటుంబ సభ్యులు, బంధువులు అంత్యక్రియల కోసం మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ ఉండగానే వర్షం జోరుగా కురవడం మొదలైంది. దీంతో వారంతా దగ్గర్లోనే నిర్మాణంలో ఉన్న ఓ షెడ్డులోకి వెళ్లారు. అయితే పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో వారంతా దాని కింద నలిగిపోయారు. ఈ ప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద ఇరుక్కుపోయినవారిని వెలికి తీయడానికి స్థానికులు, పోలీసులతో పాటు ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు సహాయ చర్యలు చేపట్టాయి. 15 మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘యూపీలో జరిగిన దురదృష్టకర ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా’’ అని మోదీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు యోగి రూ.2లక్షల చొప్పున సాయం ప్రకటించారు. ఘటనపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే, ఆరోగ్య మంత్రి అతుల్ గార్గ్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. గాజియాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి వీకే సింగ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.