వివాహమైన ఆరు నెలలకే మహిళ బలవన్మరణంమరుసటి రోజే భర్త ఆత్మహత్యాయత్నం



కాటేసిన కట్న దాహం

పురుగు మందు తాగడంతో శరీరమంతా పట్టుతప్పుతుండగా.. పుట్టింట మరణం అంచున ఉన్న ఆమెకు చివరగా భర్తే గుర్తొచ్చాడు. నోటమాట వచ్చీరాని పరిస్థితుల్లో ఆమె భర్తకు ఫోన్‌ చేశారు. ఆమె స్వరం స్వాధీనం తప్పడాన్ని గమనించిన భర్త ‘ఏంటి అలా మాట్లాడుతున్నావ’ని ప్రశ్నించాడు. ‘నన్నెందుకు వదిలేశావ్‌... పురుగు మందు తాగా’ అని ఎట్టకేలకు సత్తువ తెచ్చుకొని ఆమె బదులిచ్చారు. నల్గొండ జిల్లాలో కొత్తగా పెళ్లయిన ఓ యువతి కట్న దాహానికి బలైపోయిందంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఈ ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది.
సూర్యాపేట నేరవిభాగం, కేతేపల్లి, న్యూస్‌టుడే: ప్రేమ వివాహమైన ఆరు నెలలకే అత్తింట అదనపు కట్నం వేధింపులు.. ఆ పచ్చని కాపురంలో చిచ్చుపెట్టాయి. యువతి పురుగు మందు తాగి బలవన్మరణం చెందగా... తెలుసుకున్న భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌కు చెందిన ఎడ్ల లావణ్య(21), సూర్యాపేటకు చెందిన పెద్దపంగ ప్రణయ్‌ ప్రేమించుకున్నారు. గతేడాది జూన్‌ 12న పెద్దల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. వివాహ సమయంలో కట్నకానుకల కింద ఆమ్మాయి తరఫు వారు రూ.30లక్షల విలువైన వ్యవసాయ భూమి, నగదు అప్పజెప్పారు. ప్రణయ్‌ వ్యవసాయ శాఖలో ఏఈవోగా పనిచేస్తున్నారు. లావణ్య వెటర్నరి డాక్టర్‌ కోర్సు అభ్యసించారు. ఇటీవల ప్రణయ్‌ కుటుంబ సభ్యులు లావణ్యను అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధింపులకు గురిచేశారు. మూడు రోజుల క్రితం ప్రణయ్‌ ఆమెను సూర్యాపేట నుంచి తీసుకెళ్లి కొర్లపహాడ్‌లోని పుట్టింటిలో వదిలివచ్చారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లావణ్య శనివారం పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. గుర్తించిన బంధువులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి ఆమె చనిపోయారు. చనిపోతూ భర్తతో ఆమె మాట్లాడిన చివరి మాటలుగా భావిస్తున్న ఆడియో ఒకటి వైరల్‌ అవుతోంది. భార్య మృతి చెందిందని తెలుసుకున్న ప్రణయ్‌ సూర్యాపేట చర్చికాంపౌండ్‌లోని తన నివాసంలో పురుగు మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. తాను ఎంతగానో ప్రేమించే భార్య లావణ్య ఇకలేదని, తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ప్రణయ్‌ రాసిన లేఖను పోలీసులు గుర్తించారు. మృతురాలి తండ్రి సుందరయ్య ఫిర్యాదు మేరకు లావణ్య భర్త ప్రణయ్‌, అతని తల్లిదండ్రులు కరుణానిధి, ఉజ్వల, సోదరుడు సంజీవ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు కేతేపల్లి ఎస్సై రామకృష్ణ తెలిపారు.

Post a Comment

Previous Post Next Post