ఫోన్‌ చేసి పిలిచి.. తెదేపా నేత హత్య


గుంటూరు జిల్లా దాచేపల్లిలో దారుణం
అధికార పార్టీ నాయకులే చంపేశారు: యరపతినేని

ఫోన్‌ చేసి పిలిచి.. తెదేపా నేత హత్య

దాచేపల్లి, గురజాల, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచి, తెలుగుదేశం పార్టీ కీలక నేత పురంశెట్టి అంకులు (65) ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. దాచేపల్లి పట్టణంలోని ఓ అపార్టుమెంటు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను గొంతు కోసి హతమార్చారు.ఒక ఫోన్‌కాల్‌ రావడంతో సొంతూరి నుంచి అంకులు దాచేపల్లికి రాత్రి 7 గంటల సమయంలో వెళ్లారు. కారును రహదారిపై నిలిపి నిర్మాణంలో ఉన్న అపార్టుమెంటు వద్దకు ఒంటరిగా వెళ్లారు. తర్వాత కొద్దిసేపటికే మొదటి అంతస్థులో శవమయ్యారు. ఒంటరిగా వెళ్లిన అంకులు తిరిగి రాకపోయేసరికి డ్రైవరుకు అనుమానం వచ్చి అక్కడకు వెళ్లి చూడగా మృతదేహం కనిపించింది. కాసేపటికి తెదేపా నాయకులు అక్కడకు చేరుకొని ఆందోళన చేపట్టారు. హత్యకు నిరసనగా అద్దంకి-నార్కట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పెదగార్లపాడుకు అంకులు పదేళ్లపాటు సర్పంచిగా పనిచేశారు. ఆయన భార్య పున్నమ్మ సర్పంచిగా, కుమారుడు పరంజ్యోతి ఎంపీటీసీ సభ్యునిగా పనిచేశారు. దాచేపల్లి సమీపంలో నిర్మించిన సిమెంటు కర్మాగారానికి భూసేకరణలో కీలకపాత్ర వహించారు.

ఫోన్‌ చేసి పిలిచి.. తెదేపా నేత హత్య

గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఘటనా స్ధలానికి చేరుకొని హత్యపై ఆరాతీశారు. ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, పెదగార్లపాడు వైకాపా నాయకులు, పోలీసుల ప్రోద్బలంతోనే హత్య జరిగిందని యరపతినేని ఆరోపించారు. పదేళ్ల క్రితం గ్రామంలో ఆయనపై దాడి జరిగినందున, జాగ్రత్తగా ఉండాలని నూతన ఏడాది సందర్భంగా కలిసినప్పుడు అంకులుకు సూచించానన్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సోమవారం దాచేపల్లికి వస్తారని యరపతినేని పేర్కొన్నారు. అంకులు హత్యతో పల్నాడు ప్రాంతం ఉలిక్కిపడింది. దాచేపల్లిలో పోలీసులను మోహరించారు. హత్య జరిగిన వెంటనే డీఎస్పీ జయరాంప్రసాద్‌ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అంకులు ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కారు డ్రైవరుతో పాటు పలువురిని పోలీసులు విచారిస్తున్నారు.

ఫోన్‌ చేసి పిలిచి.. తెదేపా నేత హత్య


Post a Comment

Previous Post Next Post