లక్నో: దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ఉత్తరప్రదేశ్ ,బదౌన్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో గత ఐదురోజులుగా తప్పించుకు తిరుగుతున్న ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదు రోజుల పాటు గాలింపు తరువాత ఆలయ పూజారిని సత్యనారాయణ్ (50) గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు ప్రకటించారు. ఉఘైతీ గ్రామ సమీపంలోని ఆడవిలో అతని అనుచరుడి ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. నిందితుడు సత్య నారాయణ్‌ను ప్రశ్నిస్తున్నామని, వైద్య పరీక్షల అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరుస్తామని సీనియర్ ఎస్పీ సంకల్ప్ శర్మ తెలిపారు.
కాగా ఈ నెల 3వ తేదీ ఆదివారం సాయంత్రం స్థానిక ఆలయానికి వెళ్లిన బదౌన్‌కుచెందిన 50 ఏళ్ల మహిళపై ముగ్గురి వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, అనంతరం దారుణంగా హత్య చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం కావడంతో యూపీ సర్కార్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను మంగళవారం రాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.