
కార్వార, న్యూస్‌టుడే: కర్ణాటకలోని అంకోలా సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్‌యశోనాయక్ భార్య విజయానాయక్ మృతి చెందారు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మంత్రి వ్యక్తిగత సహాయకుడు దీపక్ దూబే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ప్రమాదంలో కేంద్ర మంత్రితో పాటు ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. వారు ప్రయాణిస్తున్న వాహనం ఉత్తర కన్నడ జిల్లా యల్లాపుర నుంచి గోకర్ణకు వెళ్తున్న సమయంలో హొసకంది గ్రామం వద్ద బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన కేంద్ర మంత్రిని మెరుగైన వైద్యం కోసం గోవా వైద్యకళాశాలకు తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యడియూరప్ప తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి సతీమణి మృతి చెందడంతో తన సానుభూతిని తెలిపారు. ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థలలో శనివారం ప్రకృతి చికిత్స కేంద్రాన్ని ప్రారంభించిన శ్రీపాద యశోనాయక్ ఆది, సోమవారాల్లో కర్ణాటకలోని వివిధ ధార్మిక కేంద్రాల్లో పర్యటించారు. గోకర్ణలో పరమ శివలింగాన్ని దర్శించుకోవడానికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
