పోలీసుల అదుపులో 8 మంది! పరారీలోనే భార్గవరామ్, గుంటూరు శ్రీను జగత్ విఖ్యాత్‌రెడ్డి ప్రమేయంపైనా ఆరా కిడ్నాప్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు హైదరాబాద్
హైదరాబాద్‌లో రూ.2 వేల కోట్ల విలువైన భూముల హక్కుల కోసం ప్రవీణ్‌రావు సోదరులను కిడ్నాప్ చేసిన కేసులో 8 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. గోవాలో నలుగురిని, గుంటూరు, విజయవాడల్లో మరో నలుగురిని పట్టుకున్నారని తెలిసింది. వీరిని బుధవారం ఉదయానికి హైదరాబాద్‌కు తీసుకురానున్నట్లు సమాచారం. గోవాలో అదుపులోకి తీసుకున్న నలుగురిలో కృష్ణా జిల్లా కొండపల్లికి చెందిన ఇద్దరు అన్నదమ్ములున్నారు. మరో నలుగురు యువకులను కొండపల్లిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులను వదిలేసి కార్లలో పారిపోయిన నిందితులు బృందాలుగా వేర్వేరు ప్రాంతాలకు పరారయ్యారని పోలీసులు గుర్తించారు. విచారణలో అఖిలప్రియ వ్యక్తిగత సహాయకుడు నిందితుల వివరాలు చెప్పడంతో బోయిన్‌పల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారి కదలికలపై నిఘా ఉంచారు. కీలకాధారాలు లభించగానే అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి డ్రైవరని తెలిసింది. ఇతడిని జగత్ పంపించాడా? లేదా భార్గవరామ్ రమ్మన్నాడా? అనేది పోలీసులు పరిశోధిస్తున్నారు. భార్గవరామ్, గుంటూరు శ్రీను కోసం గాలిస్తున్నామని ఉత్తర మండలం డీసీపీ కల్మేశ్వర్ శింగన్వార్ తెలిపారు.
ఈ 8 మంది నిందితులు ఐటీ అధికారులుగా వేషాలు వేసుకున్నవారేనని పోలీసులు కీలక ఆధారాలు తెలుసుకున్నారు. కిడ్నాప్‌నకు 15 రోజుల ముందు గుంటూరు శ్రీను వీరిని రప్పించాడు. ఐటీ అధికారుల్లా వ్యవహరించాల్సిన తీరుపై నిందితులకు భార్గవరామ్ సోదరుడు యూసుఫ్‌గూడలోని ఎంజీఎం ఇంటర్నేషనల్ స్కూల్‌లో శిక్షణ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఐటీ అధికారులుగా నటించి మోసాలకు పాల్పడిన ‘గ్యాంగ్’ సినిమాను సైతం వీరికి చూపించారు. నకిలీ ఐటీ బృందానికి నాయకులుగా ఇద్దరు గుంటూరు యువకులు వ్యవహరించారు.
జైల్లో పరిచయం..
ప్రవీణ్‌రావు సోదరుల అపహరణకు పథకం వేసిన అఖిలప్రియ.. ఐటీ దాడుల విషయాన్ని గుంటూరు శ్రీనుకు వివరించగా ఐటీ, పోలీస్ అధికారుల్లా ఉండే తన స్నేహితులను ఎంపికచేశాడు. డ్రైవర్లుగా ఉండేందుకు గుంటూరు, కర్నూలు, కడప జిల్లాలకు చెందినవారిలో ముగ్గురికి సమాచారమిచ్చాడు. ప్రవీణ్‌రావును కిడ్నాప్ చేయడం, అతడి సమాచారం సేకరించి భార్గవరామ్‌కు చెప్పడం వంటి పనులు చేసిన డ్రైవర్ బాలచెన్నయ్యకు నేరచరిత్ర ఉంది. గుంటూరు శ్రీను ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో అరెస్టై కడప జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్నప్పుడే అతనితో బాలచెన్నయ్యకు పరిచయమైంది. డ్రైవర్‌గా ఉద్యోగం ఇప్పించాలని బాలచెన్నయ్య శ్రీనును కోరగా కిడ్నాప్ వ్యవహారంలో పనికొస్తాడని ఈనెల 2న అతన్ని హైదరాబాద్‌కు రప్పించాడు. ఓ చిన్న పని పూర్తిచేశాక డ్రైవర్ ఉద్యోగమిప్పిస్తానని చెప్పాడు. తర్వాత సంపత్‌కుమార్ వద్దకు తీసుకెళ్లడంతో సంపత్, చెన్నయ్య కలిసి బైక్‌పై ప్రవీణ్‌రావు ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించారు.
ఆళ్లగడ్డలో విచారణ ముమ్మరం
కర్నూలు: తెలంగాణ పోలీసులు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో విచారణ ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న భార్గవరామ్ సెల్‌ఫోన్‌కు కాల్ చేసినట్లు ఆధారాలుండటంతో మర్రిపల్లెకు చెందిన ఓ తెదేపా నేతను సోమవారం పొద్దుపోయే వరకు విచారణ చేశారు. మంగళవారం ఆళ్లగడ్డకు చెందిన మండల స్థాయి ప్రజాప్రతినిధితోపాటు, చాగలమర్రికి చెందిన తెదేపా మద్దతుదారుడైన ఓ న్యాయవాదిని విచారిస్తున్నారు.
ఎందుకు చేశారు? ఎందరు ఉన్నారు?
రెండోరోజు అఖిలప్రియను ప్రశ్నించిన పోలీసులుహైదరాబాద్- కంటోన్మెంట్, న్యూస్‌టుడే: ‘ప్రవీణ్‌రావు సోదరులను ఎందుకు కిడ్నాప్ చేశారు? మీరు రూపొందించిన ప్రణాళికలో ఎంతమంది ఉన్నారు? మీరే స్వయంగా పాల్గొనాలని ఎందుకు అనుకున్నారు?’ అంటూ భూమా అఖిలప్రియను పోలీసులు మంగళవారం ప్రశ్నించినట్టు తెలిసింది. చంచల్‌గూడ జైల్లో ఉన్న అఖిలప్రియను న్యాయస్థానం అనుమతితో అదుపులోకి తీసుకున్న పోలీసులు బేగంపేట ఠాణాలో రెండు రోజులుగా విచారిస్తున్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని అఖిలప్రియ తొలిరోజు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. మంగళవారం ఉదయం సాక్ష్యాధారాలు, ఫోన్‌కాల్స్ వివరాలను చూపించి ప్రశ్నించినప్పుడు ముక్తసరిగా సమాధానాలు చెప్పినట్టు తెలిసింది. మహిళా అధికారే విచారించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న నేపథ్యంలో బేగంపేట మహిళా పోలీస్ ఠాణా ఇన్‌స్పెక్టర్ జోత్స్న ఆమెను ప్రశ్నించారు. ఉదయం పదింటి నుంచి సాయంత్రం ఐదింటి వరకు ఆమెను విచారించారు. విచారణ మధ్యలో ఆమెను కాఫీ, టీ తాగుతారా? అని అడగ్గా తనకు పండ్లు కావాలని కోరగా తెప్పించారు. మధ్యాహ్న భోజనంలో తనకు శాకాహారం చాలంటూ అఖిలప్రియ చెప్పగా తెప్పించారు. ఆమె భోజనం చేస్తున్నప్పుడు విచారణ అధికారులు దూరంగా ఉన్నారు. రెండోరోజు విచారణ ప్రక్రియ పూర్తయ్యాక కొద్దిసేపు ఒంటరిగా ఉంచారు. అఖిలప్రియను ఈనెల 14 మధ్యాహ్నం వరకు విచారించనున్నామని ఉత్తర మండలం డీసీపీ కల్మేశ్వర్ శింగన్వార్ తెలిపారు.