లఖ్‌నవూ: అనుకోకుండా కాలువలోకి కొట్టుకొచ్చిన ఓ డాల్ఫిన్‌ను కొందరు ఆకతాయిలు కిరాతకంగా కొట్టి చంపారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దీనికి కారణమైన వారిలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉన్న ఓ కాలువలోకి డిసెంబర్ 31న డాల్ఫిన్ వచ్చింది. దీంతో అక్కడున్న కొందరు ఆకతాయిలు దానిపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. వర్షం పడుతున్నా వదలకుండా రక్తం వచ్చేలా కొట్టారు.
ఈ క్రమంలో ఓ నిందితుడు డాల్ఫిన్‌పై గొడ్డలితో దాడి చేసి ఇనుప రాడ్డును శరీరంలోకి దించాడు. దీంతో అది ప్రాణాలు కోల్పోయింది. కారణం లేకుండానే వారు డాల్ఫిన్‌పై దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ‘కాలువ పక్కన డాల్ఫిన్ ప్రాణం లేకుండా పడి ఉండటం గమనించాం. దీంతో స్థానికులను ప్రశ్నించగా ఎవరు చంపారో తెలియదని సమాధానం ఇచ్చారు. డాల్ఫిన్ శరీరంలో గాయాలు, గొడ్డలి పోట్లను గమనించిన అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేశాం’ అని అటవీ శాఖ అధికారి చెప్పారు. డాల్ఫిన్‌పై దాడి చేసి చంపిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.