భర్తను చంపి.. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసి

దర్యాప్తు చేపట్టిన పోలీసులు

న్యూఢిల్లీ: మనుషుల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోతున్నాయి. క్షణికావేశంలో.. ప్రేమాభిమానాలను మరిచి రాక్షసులుగా ప్రవర్తిస్తున్న ఘటనలు కొకొల్లలు. తాజాగా ఈ కోవకు చెందిన ఘటన ఒకటి దేశ రాజధానిలో చోటు చేసుకుంది. ఓ మహిళ తన భర్తను చంపి.. ఈ సమాచారాన్ని తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో షేర్‌ చేసింది. ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్యాప్రయత్నం చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్‌ ఉజ్జయినికి చెందిన మహిళ తన భర్తతో కలిసి 2013 నుంచి దక్షిణ ఢిల్లీలోని ఛత్తర్‌పూర్‌ ఎక్స్‌టెన్షన్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటుంది. భార్యాభర్తలిద్దరు వేర్వేరు ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో పని చేస్తున్నారు. అయితే ఈ దంపతులకు ఇంత వరకు సంతానం కలగలేదు. ఇక ఇద్దరి మధ్య సంబంధాలు కూడా సరిగా ఉండేవి కావని ఇరుగుపొరుగు వారు తెలిపారు. ఈ క్రమంలో శనివారం భార్యభర్తలిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో సదరు మహిళ భర్తను కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో షేర్‌ చేసింది. ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది.

ఇక సోమవారం ఈ ఎఫ్‌బీ పోస్ట్‌ని గమనించిన పక్కింటి వ్యక్తి దీని గురించి పోలీసులకు సమాచారం అందిచండంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డోర్‌ లోపలి వైపు లాక్‌ చేసి ఉండటంతో.. తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ సదరు మహిళ భర్త చనిపోయి రక్తపు మడుగులో పడి ఉండగా.. ఇక నిందితురాలు కొన ఊపిరితో కొట్టుకుంటుంది. తక్షణమే పోలీసులు ఆమెని ఢిల్లీ ఎయిమ్స్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే సదరు మహిళ మీద కేసు నమోదు చేశారు. ఇక ఆమె కోలుకున్న తర్వాత స్టేట్‌మెంట్‌ రికార్డు చేయాలని భావిస్తున్నారు. 

Post a Comment

أحدث أقدم