సేతుపతిలా పేరు తెచ్చుకోవాలి


నటనా ప్రాధాన్యమున్న పాత్రలకు చిరునామాగా నిలుస్తూ.. వరుస విజయాలతో దూసుకెళ్తున్న కథానాయిక నివేదా పేతురాజ్‌. గతేడాది సంక్రాంతికి ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆమె.. ఈ పండక్కి ‘రెడ్‌’తో  ప్రేక్షకుల ముందుకొస్తోంది. రామ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. కిశోర్‌ తిరుమల దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడింది నివేదా.

సేతుపతిలా పేరు తెచ్చుకోవాలి

‘‘సంక్రాంతికి వస్తున్న నా రెండో చిత్రమిది. దానికి తోడు కొవిడ్‌ పరిస్థితుల తర్వాత నా నుంచి వస్తున్న తొలి చిత్రం. అందుకే చాలా సంతోషంగా ఉంది. కిశోర్‌ తిరుమలతో ‘చిత్రలహరి’ చేస్తున్నప్పుడే నాకు ఈ ‘తడం’ రీమేక్‌ గురించి చెప్పారు. దీంట్లో ఓ పోలీస్‌ పాత్ర ఉంది నువ్వే చేయాలన్నారు. నేను కథ వినకుండానే చేస్తానని చెప్పేశా. నాకు   ఆయనపై ఉన్న నమ్మకం అలాంటిది. సినిమా చేస్తున్నప్పుడు నేను మాతృకను చూడలేదు. నా పాత్ర కొత్తగా చూపించాలనుకున్నా.
‘‘చిత్రసీమలోకి వచ్చిన కొత్తలో కథేంటి? స్క్రిప్ట్‌లో నా పాత్రేంటి? అన్నది ఆలోచించకుండా దాదాపు ఎనిమిది చిత్రాలు చేశా. నేనలా చేసి ఎంత పెద్ద తప్పు చేశానో తర్వాత  అర్థమైంది. తర్వాత కథలు, పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగేయడం నేర్చుకున్నా. మంచి నటనా  ప్రాధాన్యమున్న పాత్రలు దక్కించుకో  గలుగుతున్నా. అయితే నేను కథ కూడా వినకుండా సినిమాకు ఓకే చెప్పే దర్శకులు ఇద్దరున్నారు. ఒకరు వివేక్‌ ఆత్రేయ, మరొకరు కిశోర్‌ తిరుమల’’.
‘‘ఈ చిత్రంలో నేను పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తా. పూర్తి నిడివి ఉన్న పాత్ర అది. ‘చిత్రలహరి’లోని నా పాత్రకి పూర్తి భిన్నమైన పాత్ర. నేనిందులో పోలీస్‌లా పైకి చాలా సీరియస్‌గా కనిపిస్తున్నట్లు ఉన్నా.. లోపల చాలా అమాయకత్వం నిండిన అమ్మాయిలా ఉంటా. సెట్లో దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని ఎంతో క్లారిటీగా వివరించే వాళ్లు. ఈ చిత్రం కోసం రామ్‌తో కలిసి పనిచేయడాన్ని ఎంతో ఆస్వాదించా. వృత్తిపట్ల ఎంతో నిబద్ధత ఉన్న వ్యక్తి ఆయన. సెట్లో ఎప్పుడూ ఎంతో సరదాగా.. నవ్వుతూ నవ్విస్తుంటారు. ఈ చిత్రంలో ఆయన కవలలుగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు. ఆ రెండు పాత్రల్లో ఆయన చూపిన వైవిధ్యం అందరినీ ఆకట్టుకుంటుంది’’.
‘‘ప్రస్తుతం నేను ‘విరాటపర్వం’లో అతిథి పాత్రలో నటిస్తున్నా. దాంట్లో నాకు ఒక ఫైట్‌ సీక్వెన్స్‌ ఉంది. విష్వక్‌ సేన్‌తో ‘పాగల్‌’ సినిమా చేస్తున్నా. చందు మొండేటి దర్శకత్వంలో ఒక వెబ్‌ ఫిల్మ్‌ చిత్రీకరణ పూర్తయింది. ‘కార్తికేయ2’ స్క్రిప్ట్‌ వినాల్సి ఉంది. త్వరలో తెలుగులో మరో కొత్త చిత్రానికి సంతకాలు చేయనున్నా’’.  
‘‘అదృష్టవశాత్తూ.. కెరీర్‌ తొలినాళ్లలోనే వైవిధ్యమైన నటనా ప్రాధాన్యమున్న పాత్రలతో రాణించే అవకాశం దక్కింది. అందుకే నాకిప్పుడు రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోయిన్లు చేసే గ్లామర్‌ పాత్రలు చేయాలనిపిస్తోంది. అయితే ఆ గ్లామర్‌ అన్నది కథానుగుణంగా ఉండాలి. నిజానికి నన్ను నేనేప్పుడూ విజయ్‌ సేతుపతికి ఫీమేల్‌ వెర్షన్‌లా చూసుకోవాలని అనుకుంటా. ఆయన సినిమాలు చూడండి.. హీరోగా చేస్తారు, హీరోయిన్‌ తండ్రిగా మెప్పిస్తారు,   విలన్‌గా భయపెడతారు. ఆఖరికి ‘సూపర్‌ డీలక్స్‌’తో హీరోయిన్‌గా కూడా చేసేశారు (నవ్వుతూ). నాకు అలా అన్ని రకాల పాత్రలతో మెప్పించాలనుంది. ఫీమేల్‌ సేతుపతిలా పేరు తెచ్చుకోవాలని ఉంది. ఎందుకంటే కథానాయికల కెరీర్‌ చాలా చిన్నది. కమర్షియల్‌ నాయికగా మారిపోతే.. కొన్నాళ్లే మన ప్రతిభ చూపించుకోగలుగుతాం. అదే ఇలాగైతే జీవితాంతం హ్యాపీగా గడిపేయొచ్చు’’.

Post a Comment

Previous Post Next Post