మూసాపేట, న్యూస్‌టుడే: ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఓ పూల వ్యాపారి కూకట్‌పల్లి ఠాణా పరిధిలో దారుణ హత్యకు గురయ్యాడు. శవాన్ని ఓ సంచిలో మూటకట్టి సమీపంలో ఉన్న చెరువులో పారేశారు. కూకట్‌పల్లి సీఐ టి.నర్సింగ్‌రావు, మృతుని బంధువుల వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం పెంట్లవెళ్లి గ్రామానికి చెందిన నక్కా లక్ష్మీ, ఆంజనేయులు కుటుంబం చాలా ఏళ్ల క్రితం నగరానికి వలసొచ్చింది. కూకట్‌పల్లి ప్రకాష్‌నగర్‌లో ఉంటున్న వీరికి లక్ష్మణ్, కృష్ణ కుమారులు. ఆంజనేయులుకు పక్షవాతం రావడంతో ఆయనతోపాటు అతని భార్య లక్ష్మి, లక్ష్మణ్ దంపతులు సొంతూరుకు వెళ్లారు. ప్రస్తుతం ప్రకాష్ నగర్‌లో కృష్ణ ఒక్కడే ఉంటూ పూల వ్యాపారం చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కూకట్‌పల్లి నల్లచెరువులో ఓ సంచిలో చుట్టిన వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అతను కృష్ణ అని స్థానికులు గుర్తించారు. ఇంటి ఆవరణతోపాటు ఇంటి ముందు లభించిన రక్తపు మరకలనుబట్టి ఇంట్లోనే చంపి ఉంటారని తేలింది. ఇంటికి తాళం వేసి ఉండటాన్నిబట్టి తెలిసిన వారి పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన ఇల్లు చెరువుకు సమీపంలోనే ఉంది. అయితే అక్కడ ఇనుప కంచె ఉండటంతో శవాన్ని చెరువులో వేయడం కష్టంగా మారడంతో దేవీనగర్ వైపున్న మార్గం గుండా చెరువులోకి వెళ్లి కట్ట దిగువన పారేశారు.
ఇంట్లో చంపేశారు.. మూటకట్టి చెరువులో పారేశారు!కూకట్‌పల్లిలో పూల వ్యాపారి దారుణ హత్య
AMARAVATHI NEWS WORLD
0