ముంబయి పేలుళ్ల సూత్రధారి లఖ్వీ అరెస్టు



లాహోర్‌: ముంబయి పేలుళ్ల సూత్రధారి, లష్కర్‌-ఎ-తొయిబా కమాండర్‌ జకీ-ఉర్‌-రెహ్మాన్‌ లఖ్వీ (61)ని శనివారం పాకిస్థాన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న ఆరోపణలతో నమోదయిన కేసులో లఖ్వీని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలని పాకిస్థాన్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. తాము నిర్వహించిన నిఘా ఆపరేషన్‌ అనంతరం లఖ్వీని లాహోర్‌లో అరెస్టు చేసినట్లు పంజాబ్‌ ప్రావిన్సుకి చెందిన ఉగ్రవాద వ్యతిరేక విభాగం(సీటీడీ) వర్గాలు వెల్లడించాయి. లాహోర్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు ముందు నిందితుడిని హాజరుపరుచనున్నట్లు సీటీడీ తెలిపింది. ‘‘ఉగ్రవాద పోషణ కోసం సేకరించిన నిధులను ఉపయోగించి లఖ్వీ.. ఒక చికిత్సా కేంద్రాన్ని నడిపిస్తున్నాడు. దీని ద్వారా సమీకరించిన నిధులను తిరిగి ఉగ్రవాదులకు చేరవేసేవాడు. వాటిని సొంత ఖర్చులకు కూడా వాడుకున్నాడు’’ అని సీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. లఖ్వీని 2008లో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ముంబయి దాడుల కేసులో అరెస్టయిన లఖ్వీ.. 2015 నుంచి బెయిల్‌పై ఉన్నాడు.

Post a Comment

أحدث أقدم