లుంగీలో మూటగట్టి జనరేటర్ గదిలో భద్రపరిచిన వైనం దుర్వాసన వస్తుండటంతో వెతికి గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో మనిషి అవశేషాలున్న డబ్బా సోమవారం కలకలం సృష్టించింది. అందులో పుర్రె, చేతి ఎముక, పళ్లు ఉన్నాయి. ఆస్పత్రి వర్గాల కథనం ప్రకారం.. పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో దుర్వాసన వస్తుండటంతో.. సిబ్బంది పరిశీలించి జనరేటర్ ఉండే ఎలక్ట్రికల్ గది నుంచి వస్తున్నట్లు గుర్తించారు. ఆ గదిలో మూలకు నీలం రంగు లుంగీతో కట్టిన మూట కనిపించింది. శానిటేషన్ సూపర్‌వైజర్ దుర్గా, వార్డు బాయ్ ఎన్‌సీపీ.బాబు దాన్ని విప్పి పరిశీలించగా.. అందులో బాక్స్ ఉంది. తెరిచి చూడగా.. ప్లాస్టిక్ డబ్బా, ప్లాస్టిక్ కవర్ కనిపించాయి. ప్లాస్టిక్ డబ్బాలో మనిషి మొండెం నుంచి వేరు చేసిన పుర్రె, చేతి ఎముక ఉన్నాయి. కవర్‌లో కళ్లు, పళ్లు ఉన్నాయి.
నాలుగైదు రోజుల క్రితం మృతి చెందిన శవం అవశేషాలుగా సిబ్బంది భావిస్తున్నారు. ఈ అవశేషాల మూటను మార్చురీ గదికి తరలించారు. పోలీసులు ఆస్పత్రి సిబ్బంది సహకారంతో సీసీ పుటేజీలో నాలుగైదు రోజులుగా ఆస్పత్రికి రాకపోకలు సాగించిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, ఈ ఘటనపై సిబ్బంది మాట్లాడుతూ వాటిని పోస్ట్‌మార్టం కోసం తెచ్చామని చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. పోస్ట్‌మార్టం సిబ్బంది మాత్రం అటువంటిదేమీ లేదని పై అధికారులకు తెలిపినట్లు సమాచారం. సూపరింటెండెంట్ ముక్కంటేశ్వరరావును వివరణ కోరగా.. తాను మీటింగ్ ఉండటం వల్ల ఆస్పత్రిలో లేనని, వివరాలు తెలుసుకుంటానని పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని సిబ్బంది పరిశీలించారని, ఫిర్యాదు ఇస్తే దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ ప్రవీణ్ తెలిపారు.