పార్లమెంట్లో ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
కరోనా కష్టాలను తొలగించే ప్రకటనలపై ఆశలు
ఆర్థిక వ్యవస్థ దుష్ప్రభావాలను అంతం చేసే ‘వ్యాక్సిన్’గా ఆశాభావం
వైద్యారోగ్య, రక్షణ, మౌలిక రంగాలకు కేటాయింపులు పెంచే అవకాశం
న్యూఢిల్లీ: కరోనాతో ఒకవైపు జనజీవితం, మరోవైపు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు(సోమవారం) ఉదయం 11 గంటలకు పార్లమెం ట్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ‘నెవర్ బిఫోర్’ బడ్జెట్‌ను ప్రకటించనున్నట్లు ఇటీవల నిర్మల ప్రకటించిన నేపథ్యంలో.. కరోనా మహమ్మారితో కుదేలైన వ్యవస్థలన్నీ ఈ బడ్జెట్‌పై భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నాయి.
కరోనా దుష్ప్రభావాలను నిర్మూలించే సమర్ధవంతమైన ‘వాక్సిన్’ను ఆర్థిక మంత్రి ప్రకటిస్తారని ఎదురు చూస్తున్నాయి. కరోనా కడగండ్లతో చతికిలపడిన సామాన్యుడికి ఊరట కల్పించే నిర్ణయాలతో పాటు, దేశ ఆర్థిక వ్యవస్థ వేగం పెంచే ఉద్దీపనల వరకు.. సమస్త పునరుజ్జీవన చర్యలు ఈ బడ్జెట్‌లో ఉంటాయన్న ఆశాభావంతో ప్రజలు న్నారు. బడ్జెట్‌ను లెదర్ బ్యాగ్‌లో పార్లమెంటుకు తీసుకువచ్చే దశాబ్దాల సంప్రదాయాన్ని 2019లో తన తొలి బడ్జెట్ ప్రకటన సందర్భంగా నిర్మల తోసిపుచ్చారు. ఎర్రని వస్త్రంలో చుట్టిన ‘బహీ ఖాతా’లో బడ్జెట్‌ను పార్లమెంటుకు తీసుకువచ్చారు. ఈ సారి ఆ బహీ ఖాతాలో ఆర్థిక మంత్రి ఏం దాచారనేది ఆసక్తిగా మారింది.
కరోనా తగ్గుముఖం పడుతుండటం, వ్యాక్సినేషన్ కొనసాగుతుండటం వంటి సానుకూలతల మధ్య వస్తున్న ఈ బడ్జెట్ దేశంలోని అన్ని వ్యవస్థలకు జవజీవాలను చేకూర్చేలా ఉండాలి. కరోనా ప్రారంభమయ్యేనాటికే దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. 2019–20 జీడీపీ 11 సంవత్సరాల కనిష్టానికి దిగజారి, 4 శాతానికి చేరింది. పెట్టుబడుల వృద్ధి రేటు కూడా తిరోగమనంలో ఉంది. ఆ తరువాత, కరోనా వైరస్ కట్టడికి ప్రకటించిన లాక్‌డౌన్‌తో ఆర్థికరంగ కార్యకలాపాలు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. దాంతో, ‘ఆత్మనిర్భర్ భారత్’ పేరుతో ప్రభుత్వం 3 ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిం చింది. అయితే, అవేమీ పెద్దగా ప్రభావం చూపలేదు.
కాగా, ఈ బడ్జెట్‌లో కరోనా టీకా కార్యక్రమం ఖర్చు ఎంత ఉండనుందనేది ఆసక్తిగా మారింది. బీపీసీఎల్, ఎస్‌సీఐ, ఎయిర్‌ఇండియా వంటి సంస్థల ప్రైవేటైజేషన్‌తో ఎంత ఆదాయాన్ని సమకూర్చు కోవాలని ప్రభుత్వం భావిస్తోందన్న విషయం కూడా నిపుణుల దృష్టిలో ఉంది. ‘ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులతో మౌలిక రంగానికి సహకరించాలి. పారిశ్రామిక, సేవలు, సాగు రంగాల్లోకి పెద్ద ఎత్తున ప్రైవేటు, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాలి. పన్ను ఆదాయంపై రాజీ పడకుండానే ప్రజల్లో వినియోగం పెంచాలి. ఆరోగ్య, విద్య రంగాల్లో కేటాయింపులు పెంచాలి’ అని ‘డూన్ అండ్ బ్రాడ్‌షీట్’లో గ్లోబల్ చీఫ్ ఎకనమిస్ట్‌గా ఉన్న అరుణ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘ప్రజలపై భారం వేయకుండా, ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింప చేయడమనే క్లిష్టమైన సవాలు ప్రభుత్వం ముందుంద’ని ఆయన వ్యాఖ్యానించారు. ‘వైద్యారోగ్య రంగంలో మౌలిక వసతులు, బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు, 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల అమలు వంటి అంశాలపై కూడా ఈ బడ్జెట్‌లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని బ్రిక్‌వర్క్ రేటింగ్స్ పేర్కొంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ సదుపాయం పెంచడంపై, విద్య, వైద్య రంగాల్లో పెట్టబడులు పెంచడంపై దృష్టి పెట్టాలని ‘గ్లోబల్ డేటా’ సంస్థ సూచించింది.