ప్రియురాలి ఇంటి నుంచి.. పాకిస్థాన్‌లోకి


ప్రియురాలి ఇంటి నుంచి.. పాకిస్థాన్‌లోకి పాకిస్థాన్‌లో చిక్కుకున్న రాజస్థాన్‌ యువకుడు సత్వరం తీసుకురావాలని కోరుతున్న బంధువులు

ప్రియురాలి ఇంటి నుంచి.. పాకిస్థాన్‌లోకి

జైపూర్‌: ప్రియురాలిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లిన ఓ యువకుడు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చే క్రమంలో పొరపాటున సరిహద్దును దాటి పాకిస్థాన్‌లోకి అడుగుపెట్టాడు. ఈ ఘటన గతేడాది నవంబరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గెమ్రా రామ్‌ మేఘ్‌వల్‌(19) అనే యువకుడు భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో గల కుంహారో కా టిబ్బా ప్రాంతంలో నివసిస్తున్నాడు. 2020 నవంబరులో అతడు తన ప్రియురాలిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో హఠాత్తుగా ఆమె తల్లిదండ్రులు ఇంటికి తిరిగి రావడంతో అతడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అలా పారిపోతూ పొరపాటున సరిహద్దును దాటి పాకిస్థాన్‌లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత పాకిస్థాన్‌ అధికారులు అతణ్ని అరెస్టు చేసినట్లు రాజస్థాన్‌ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో సదరు యువకుణ్ని పాకిస్థాన్‌లో ఎన్ని చిత్ర హింసలు పెడుతున్నారోనని అతడి కుటుంబీకులు తల్లడిల్లుతున్నారు.


గత నవంబరులో మేఘ్‌వల్‌ కన్పించడంలేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అతణ్ని వీలైనంత త్వరలో భారత్‌కు తీసుకురావాలని కోరుతూ గురువారం స్థానిక భాజపా నాయకులతో కలిసి జిల్లా కలెక్టరును కలిశారు. సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్‌ఎఫ్‌) చెందిన ఓ అధికారి ఈ కేసును పరిశీలిస్తున్నామని తెలిపారు. ‘‘పాకిస్థాన్‌ రేంజర్లతో అనేక సార్లు సమావేశాలు జరిగిన తర్వాత మేఘ్‌వల్‌ సింధ్‌ పోలీసుల అధీనంలో ఉన్నాడని వారు తెలిపారు. చట్టపరమైన చర్యలు పూర్తైన తర్వాత అతణ్ని భారత్‌కు అప్పగిస్తామన్నారు. అతడు భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాతే పాకిస్థాన్‌లోకి ఏ విధంగా ప్రవేశించాడన్న విషయం తెలుస్తుంది.’’ అని ఆయన వెల్లడించారు.

Post a Comment

أحدث أقدم