దేశంలో కొత్త విపత్తు

 

బర్డ్‌ ఫ్లూ ప్రభావంతో కేరళ ప్రకటన పెంపుడు కోళ్లు, బాతుల హననం ప్రారంభం రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో కాకులు మృతి పలు రాష్ట్రాల్లోఅలర్ట్‌

 న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్‌ ఫ్లూ) వైరస్‌ తీవ్ర కలకలం రేపుతోంది. పక్షులకు ప్రాణాంతకమైన ఈ హెచ్‌5ఎన్‌1 వైరస్‌ కారణంగా రాజస్తాన్, కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో గణనీయమైన సంఖ్యలో వివిధ రకాల పక్షులు చనిపోతున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో ఈ వైరస్‌ వ్యాప్తి కారణంగా అడవి బాతుల (వైల్డ్‌ గీస్‌) వంటి వలస పక్షులు చనిపోయినట్లు యంత్రాంగం నిర్ధారించింది. అలాగే రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో కాకులు, కేరళలో బాతులు చనిపోయినట్టు వివిధ వార్తాసంస్థలు తెలిపాయి. హరియాణాలో కొద్దిరోజులుగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోవడం వెనక కారణాలు ఇంకా తెలియరాలేదు.  

విపత్తుగా ప్రకటించిన కేరళ 
కేరళలోని అలప్పుజ, కొట్టాయం జిల్లాల్లో ఈ వైరస్‌ ప్రభావం కనిపించింది. అలప్పుజ జిల్లాలోని కుట్టనాడ్‌ ప్రాంతంలో నేదుముడి, తకాళి, పల్లిప్పడ్, కరువత్తా తదితర నాలుగు పంచాయతీలలో బర్డ్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. కేరళలో రాష్ట్ర ప్రభుత్వం దీనిని విపత్తుగా ప్రకటించింది. ఈ కేసులు గుర్తించిన ప్రాంతాలకు ఒక కిలోమీటర్‌ పరిధిలో ఉన్న పెంపుడు కోళ్లు, బాతులను బుధవారం సాయంత్రం కల్లా చంపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలను ఏర్పాటు చేసింది. ఒక్క కుట్టనాడ్‌ ప్రాంతంలోనే 34 వేల పెంపుడు పక్షులను చంపాల్సి ఉండగా, కొట్టాయం జిల్లా నీందూర్‌ పంచాయతీలో 3 వేల పక్షులను ఇప్పటికే చంపినట్లు యంత్రాంగం తెలిపింది. ఈ పంచాయతీలో 1,700 బాతులు వైరస్‌ బారిన పడి చనిపోయాయి. అలప్పుజ జిల్లా కలెక్టర్‌ ఈ ప్రాంతంలో మాంసం, గుడ్ల వినియోగాన్ని తాత్కాలికంగా నిషేధిస్తూ ఆయా వ్యాపార కేంద్రాల మూసివేతకు ఆదేశించారు.  

మధ్యప్రదేశ్‌లోనూ..  
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వారం రోజుల్లో 155 కాకులు వైరస్‌ కారణంగా చనిపోయాయి. అయితే, ఈ వైరస్‌ ఇప్పటివరకు పౌల్ట్రీలో సంక్రమించలేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాజస్తాన్‌ నుంచి పక్షుల ద్వారా వైరస్‌ సంక్రమించినట్టు వచ్చిందని యంత్రాంగం అనుమానిస్తోంది. పొరుగునే ఉన్న రాజస్తాన్‌లోని దాదాపు 16 జిల్లాల్లో 625 పక్షులు చనిపోయినట్టు యంత్రాంగం వెల్లడించింది. ఝాల్వార్, కోటా, బారన్‌ జిల్లాల్లో వైరస్‌ జాడలు కనిపించాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో గల పాంగ్‌ డ్యామ్‌ సరస్సులో బర్డ్‌ ఫ్లూ కారణంగా 2,700 వలస పక్షులు చనిపోయాయి. ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ సోకడం వల్లే ఈ పక్షులు చనిపోయినట్టు నిర్ధారణయింది.

అప్రమత్తమైన రాష్ట్రాలు  
రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, కేరళలో బర్డ్‌ఫ్లూ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిక జారీ చేశాయి. ఆయా రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పక్షులు చనిపోవడంతో ఇతర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తమిళనాడు, కర్ణాటక, పంజాబ్‌ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాయి. కేరళను కలిపే అన్ని మార్గాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, తనిఖీలు చేపట్టినట్లు తమిళనాడు తెలిపింది. మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌ యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. ఈ వైరస్‌ మనుషులకు సోకినట్లు ఆధారాలు లేవని బాధిత రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి.

Post a Comment

Previous Post Next Post