కిసాన్‌ పరేడ్‌: దిల్లీలోకి ప్రవేశించిన ట్రాక్టర్లు


దిల్లీ: సాగుచట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో అలుపెరుగని పోరు చేస్తున్న రైతుల ఆందోళనల్లో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించ తలపెట్టిన ‘కిసాన్‌ గణతంత్ర పరేడ్‌’ అనుమతించిన సమయం కంటే ముందుగానే ప్రారంభమైంది. మరోవైపు రాజ్‌పథ్‌లో గణతంత్ర వేడుకలు జరుగుతుండడంతో రైతుల్ని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

టియర్‌ గ్యాస్‌ ప్రయోగం..

తొలుత టిక్రీ సరిహద్దు నుంచి ట్రాక్టర్లు ర్యాలీగా బయలుదేరాయి. ర్యాలీ ప్రారంభానికి ఇంకా సమయం ఉండడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు వారితో ఘర్షణకు దిగారు. బారికేడ్లను తొలగించారు. సింఘు, ఘాజీపూర్‌ ప్రాంతాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు ముకర్బా ప్రాంతంలో బారికేడ్లను తొలగించే క్రమంలో ఆందోళనకారులు పోలీసుల వాహనంపైకి ఎక్కారు. దీంతో వారిని నియంత్రించేందుకు ఓ దశలో పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఈ క్రమంలో తలెత్తిన ఘర్షణలో భద్రతాబలగాల వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఇంతలో రాజ్‌పథ్‌లో గణతంత్ర పరేడ్‌ ముగియడంతో పోలీసులు వెనక్కి తగ్గి ర్యాలీ ముందుకు సాగేందుకు అనుమతించారు.


  

పొరుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా..

మరోవైపు ర్యాలీలో పాల్గొనేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు నేటి ఉదయానికే ట్రాక్టర్లతో దిల్లీకి చేరుకున్నారు.  పంజాబ్, హరియాణాతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌ నంచి భారీ సంఖ్యలో కర్షకులు తరలివచ్చారు. ప్రతి ట్రాక్టర్‌కి ముందు జాతీయ జెండాను కట్టి రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. మరోవైపు మహిళలు, పురుషులు ట్రాక్టర్లలో తమ సంప్రదాయ రీతిలో నృత్యాలు, నాటకాలు ప్రదర్శిస్తున్నారు. 

మరోవైపు రైతుల ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్‌ కెమెరాలతో ర్యాలీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు

Post a Comment

Previous Post Next Post