ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
చైనాతో ఘర్షణ సమయంలో 8 రఫేల్ యుద్ధ విమానాలు చేతికి అందడంతో భారత్ కొంత ఊపిరి పీల్చుకొంది..! అదేంటీ.. 260 వరకు సుఖోయ్ 30 ఎంకేఐ (ఫ్లాంకర్లు) మన వద్ద ఉన్నాయి కదా..? అవే ఇప్పటికీ మన వాయుసేన వెన్నెముకగా ఉన్నాయిగా.. అనే వాదనలు ఉన్నాయి. అది నిజమే.. కానీ, చైనాతో యుద్ధ సమయంలో వీటి నుంచి భారత్‌కు వ్యూహాత్మక ఆధిపత్యం రాదు. ఎందుకంటే సుఖోయ్ విమానాలను చైనా కూడా వినియోగిస్తోంది. అందుకే భారత్ చేతికి వచ్చిన రఫేల్ విమానాలు అటువంటి ఆధిపత్యాన్ని అందిస్తాయి. సుఖోయ్‌తో పోలిస్తే రఫేల్‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఓ రకంగా చైనాలోని సుదూర ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయి దాడి చేసే సామర్థ్యం దీనికి ఉంది. అంతేకాదు సుఖోయ్ కాంబినేషన్‌లో రఫేల్ విమానాలు గాల్లోకి లేస్తే.. అడ్డుకోవడం అత్యంత కష్టం.
ఇది ఆల్‌రౌండర్..
సుఖోయ్ విమానాలు గగనతల ఆధిపత్యం కోసం ఎక్కువగా ఉపయోగపడతాయి. ఎయిర్ టు గ్రౌండ్ మిషన్లకు పెద్దగా వాడరు. ఈ యద్ధ విమానాలు 21 మీటర్ల పొడవుతో చాలా భారీగా ఉంటాయి. దీంతోపాటు అధిక సంఖ్యలో ఆయుధాలను తీసుకుపోతాయి. అదే బలహీనత కూడా. దీని రాడార్ క్రాస్ సెక్షన్ చాలా ఎక్కువ. పైగా సుఖోయ్‌లను చైనా కూడా వినియోగిస్తుండటంతో ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ఆ దేశం వద్ద ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే భారత్‌కు గగనతలం పైనుంచి భూతలంపైకి దాడి చేసే శక్తిమంతమైన సరికొత్త విమానాలు అవసరం. బాలాకోట్ దాడుల్లో చిన్నవిగా ఉండే మిరాజ్‌లను వాడారు తప్ప సుఖోయ్‌లను వాడలేదు. ఇప్పటికే ఉన్న మిరాజ్‌లు బాగా పాతవైపోయాయి. దీంతో ఇప్పుడు 15 మీటర్ల పొడవుతో చిన్నసైజులో ఉన్న రఫేల్‌ను తీసుకొన్నారు. ఇది గగనతల ఆధిపత్యంతో పాటు.. భూతలంపై దాడులు కూడా చేయగలదు. దీని రాడార్ క్రాస్ సెక్షన్ చాలా తక్కువ. పైగా దీని సిగ్నల్స్ చైనా వద్ద లేవు.
ఆయుధ ప్యాకేజీలోనూ
రఫేల్ ఆయుధ ప్యాకేజీ శత్రువులను వణికించే స్థాయిలో ఉంటుంది. శత్రువు కంటికి కనిపించనంత దూరంలో ఉన్నా.. దాడి చేసే మెటియోర్ క్షిపణులు దీనికి ఉన్నాయి. ఈ శ్రేణిలో ప్రపంచంలో ఇవే అత్యున్నతమైనవి. ఇక సూదూర భూతల లక్ష్యాలను ఛేదించే స్కాల్ప్ క్షిపణులు కూడా ఉన్నాయి. ఇవి దాదాపు 550 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయి. మైకా క్షిపణులను కూడా వాడవచ్చు. ఈ విమానంలో అమెరికా, ఇజ్రాయిల్, ఐరోపా దేశాల ఆయుధాలను కూడా చేర్చవచ్చు. సుఖోయ్ విమానాలు కేవలం రష్యా, భారత్ ఆయుధాలు మాత్రమే వాడేలా ఉంటాయి. దీనిలో రష్యా కంప్యూటర్, సాఫ్ట్‌వేర్ ఉంటుంది. వీటితో పోలిస్తే రఫేల్‌లో ఉండే పశ్చిమ దేశాలకు చెందిన కంప్యూటర్లు ఆధునికంగా ఉంటాయి. అంతేకాదు తన బరువుకు సమానమైన ఆయుధాలను రఫేల్ మోయగలదు. ఇదో రికార్డు. రఫేల్ విమానాల తయారీకి డసో ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. దీనిని ‘కతియ’ అంటారు. విమానంలో అత్యంత చిన్న భాగాలను కూడా దీనిలో డిజైన్ చేసి పరీక్షించిన తర్వాతే వినియోగించారు.
‘బడ్డీ-బడ్డీ’ వ్యవస్థ..!
రఫేల్ యుద్ధ విమానాలు గాల్లోనే ఇంధనం నింపుకోగలవు. సాధారణంగా ఓ ట్యాంకర్ విమానం నుంచి యుద్ధ విమానంలోకి చమురును పంపిస్తారు. రఫేల్‌లో ‘బడ్డీ-బడ్దీ’ రీఫ్యూయలింగ్ వ్యవస్థ ఉంది. అంటే ఒక రఫేల్ విమానం అదనపు ఇంధన ట్యాంక్‌ను తీసుకొని గాల్లోనే మరో రఫేల్ విమానంలో ఇంధనం నింపగలదు. యుద్ధ సమయంలో భారీ సైజులోని ట్యాంకర్ విమానాలు గాల్లోకి లేవడం ఆత్మహత్యాసదృశ్యం. అలాంటి సమయాల్లో ఈ బడ్డీ-బడ్డీ వ్యవస్థ ఉపయోగపడుతుంది.
అణ్వస్త్ర సామర్థ్యం..
అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం రఫేల్స్‌కు ఉంది. రాడార్ క్రాస్ సెక్షన్ తక్కువగా ఉన్న ఈ విమానాలు దీనికి అనువైనవి కూడా. ఎందుకంటే ఒక్కసారి అణ్వస్త్రంతో గాల్లోకి లేచిన విమానం శత్రువులకు దొరక్కూడదు. దొరికితే విమానం కంటే అణ్వాయుధం దెబ్బతినటం లేదా శత్రువుకు దొరకడం వల్ల జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఈ విమానాలను తక్కువ సంఖ్యలో కొన్నారంటే అవి ‘వ్యూహాత్మక’ ఆపరేషన్ల కోసమే అని గుర్తుంచుకోవాలి.
స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్
ఈ విమానాంపై స్పెక్ట్రా అనే ఎలక్ట్రానిక్ యుద్ధతంత్ర వ్యవస్థ( వార్ఫేర్‌సూట్) ఉంది. ఇది శత్రువుల రాడార్లను తప్పుదోవ పట్టిస్తుంది. దీంతోపాటు దూసుకొచ్చే క్షిపణులను తప్పించేలా ప్రత్యేకమైన విద్యుదయస్కాంత తరంగాలను వదులుతుంది. దీంతో శత్రు క్షిపణులు గందరగోళానికి గురవుతాయి.
గోల్దెన్ యారోస్ చేతికే మొదట..
భారత వాయుసేనలో బంగారు బాణాల (గోల్డెన్ యారోస్)కు ప్రత్యేక స్థానం ఉంది. వైమానిక దళంలోని 17వ స్క్వాడ్రన్‌ను ముద్దుగా ఇలా పిలుస్తారు. దీని స్థావరమైన అంబాలా దేశ సైనిక చరిత్రలో ఒక కీలక భాగం. పాకిస్థాన్‌తో తొలి యుద్ధం నుంచి గతేడాది బాలాకోట్ దాడి వరకు చాలా కీలక పాత్ర పోషించింది. 1961లో గోవా విమోచనం, 1965, 1971లో పాక్‌తో యుద్ధాలకు ఇక్కడి నుంచే విమానాలు వెళ్లాయి. 1988లో ఈ స్క్వాడ్రన్ రాష్ట్రపతి నుంచి ‘కలర్స్’ గౌరవాన్ని అందుకొంది. కార్గిల్ యుద్ధం సమయంలో పదాతి దళానికి మద్దతుగా ఉగ్రస్థావరాలపై నిర్వహించిన 'ఆపరేషన్ సఫేద్ సాగర్'లో ఈ విభాగమే పాల్గొంది. వాయుసేనకు సేవలందించేందుకు కొనుగోలు చేసే సరికొత్త రకం విమానాలు తొలుత ఇక్కడికి రావాల్సిందే. తొలి రెండు జాగ్వర్ స్క్వాడ్రన్‌లు ఇక్కడే ఏర్పాటు చేశారు. మిగ్-21 బైసన్ తొలి స్క్వాడ్రన్ ఇక్కడే ఉంది. ఇప్పుడు రఫేల్స్ విమానాలు.