ప్లాన్ ప్రకారం అద్దెకు దిగాడు పని కనిచ్చాడు..


 కేపీహెచ్‌బీలో మహిళ దారుణ హత్య శవాన్ని మూటకట్టి పరారైన నిందితుడు
అద్దెకు దిగిన నెలకు అంతమొందించాడు

స్రవంతి మృతదేహం

మూసాపేట, న్యూస్‌టుడే: తాము దంపతులమంటూ నెలక్రితం అద్దెకు దిగారు. ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేస్తున్నట్లు యజమానికి ఫోన్‌లో చెప్పి వెళ్లిపోయాడు. తీరా వచ్చి చూస్తే ఇంటి ఆవరణలోనే మూటలో మహిళ శవం కనిపించింది. భర్తగా చెప్పుకొన్న వ్యక్తే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. కేపీహెచ్‌బీకాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. వ్యాపారవేత్త అయిన సి.రంగస్వామికి కూకట్‌పల్లి హైదర్‌నగర్‌ పరిధి సత్యనారాయణ స్వామి కాలనీ (ఎస్‌.ఎస్‌.కాలనీ)లో ఓ భవన సముదాయం ఉంది. ఇందులోని మడిగెలతోపాటు గదులను అద్దెలకిస్తూ ఉపాధిని పొందుతున్నారు. గతనెల 5న ఓ జంట వచ్చింది. తాము భార్యాభర్తలమని, తమకు ఓ గది అద్దెకు కావాలని అడిగింది. తమ పేర్లు వెంకటేశ్వర్లు అలియాస్‌ శేఖర్‌, స్రవంతి (32)గా ఇంటి యజమానికి చెప్పి భవనం మొదటి అంతస్తులో ఉన్న గదిని అద్దెకు తీసుకున్నారు. ఈనెల 5న శేఖర్‌.. ఇంటి యజమానికి ఫోన్‌ చేసి తాను ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పి సామాన్లతో సహా వెళ్లిపోయాడు. అయితే ఖాళీ అయిన గదిని శుభ్రం చేయడానికి వచ్చిన పనిమనిషి.. గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని మెట్ల వద్ద మూటకట్టి ఉన్న ఓ సంచిని గమనించింది. దగ్గరికి వెళ్లి చూడగా దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి యజమానికి విషయం చెప్పింది.  సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి మూటను విప్పి చూడగా స్రవంతి మృతదేహం కనిపించింది. ఆమె తలపై బలమైన ఆయుధంతో కొట్టి మెడను చున్నీతో బిగించి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వెంకటేశ్వర్లు గురించి ఆరా తీయగా అతని చరవాణి పనిచేయడం లేదు. స్రవంతితో వచ్చిన వ్యక్తే చంపి పరారై ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలంలో మృతురాలి ఆధార్‌ నకలు దొరికింది. అందులో మృతురాలి భర్త పేరు పాపారావుగా ఉంది. చిరునామా.. ఖమ్మం జిల్లా (ప్రస్తుతం కొత్తగూడెం జిల్లా) ఇల్లెందు మండలం రాజీవ్‌నగర్‌గా ఉంది. దీన్నిబట్టి మృతురాలు అతనికి భార్య అయి ఉండదని భావిస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Post a Comment

أحدث أقدم