ఫేస్‌బుక్‌లో స్నేహం పేరుతో వల డబ్బు దోచుకుంటున్న ముఠా అరెస్టు
నేరేడ్‌మెట్, న్యూస్‌టుడే: ఫేస్‌బుక్ వేదికగా మహిళలు, పురుషులు, యువతతో స్నేహం చేసి, అందినకాడికి దోచుకుంటున్న అంతర్జాతీయ ముఠాను రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నేరేడ్‌మెట్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో సీపీ మహేష్‌భగవత్ వివరాలు వెల్లడించారు. ‘ఆఫ్రికాలోని ఘనా దేశానికి చెందిన అక్‌పలు గాడ్స్‌టైం(26), లైబీరియా దేశానికి చెందిన అడ్‌జెల్‌గిఫ్ట్ ఒసాస్(27), క్రోమా ఒయిబో(24), నైజీరియాకు చెందిన ఎన్‌కెకికాన్ఫిడెన్స్ డేవిడ్(27), ఇహిగియేటర్ డానియల్(29) స్నేహితులు. వీరు అయిదుగురూ దిల్లీ వేదికగా సైబర్ నేరాలకు పాల్పడ్డారు. ఇందులో ప్రధాన నిందితుడు గాడ్స్‌టైం 2019 మార్చిలో టూరిస్టు వీసాపై దిల్లీ వచ్చాడు. అనంతరం దాన్ని వ్యాపార వీసాగా మార్చుకున్నాడు. మిగిలిన నలుగురితో దిల్లీలోని ఓ అపార్టుమెంటులో ఫ్లాట్ తీసుకుని, తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. గాడ్స్‌టైం సైబర్ నేరాలకు ప్రణాళిక వేస్తాడని దర్యాప్తులో తేలింది.
ఒక్కొకరిదీ ఒక్కో పని
ప్రధాన సూత్రధారి గాడ్స్‌టైం పురుషులకు మహిళల ఫొటోలు, మహిళలకు పురుషుల ఫొటోలు ప్రొఫైల్‌గా పెట్టి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతాడు. వాళ్లు అంగీకరించాక చాటింగ్ చేస్తుంటాడు. తాను విదేశాల్లో నివసిస్తున్నానని, ఒంటరిని అని, చాలా డబ్బు ఉందని నమ్మిస్తాడు. మాయలో పడ్డ అమాయకులకు తరచూ బహుమతులు పంపి ఆకట్టుకుంటాడు. మిగిలిన నిందితుల్లో ఒకరు నకిలీ ధ్రువపత్రాలతో వైఫై కనెక్షన్ తీసుకుంటాడు. మరొకరు సిమ్‌కార్డులు సంపాదిస్తాడు. వీటితో ఫేస్‌బుక్‌లో పరిచయమైన అమాయకులకు ఫోన్లు చేసి వలలో వేస్తుంటారు. ఇంకొకరు కస్టమ్స్ అధికారిగా నమ్మిస్తూ డబ్బు వసూలు చేస్తుంటాడు. నాలుగోవ్యక్తి మధ్యవర్తులకు కమీషన్ ఇచ్చి బ్యాంకు ఖాతాలు తెరిచి, బాధితులు వేసే డబ్బు ఆ ఖాతాలో పడేలా చూస్తాడు. వీరంతా అంతర్జాలంలో డింగ్‌టోన్ యాప్ ద్వారా ఈ మోసాలకు పాల్పడుతున్నార’ని సీపీ వెల్లడించారు. 2020 నవంబరు 28న రాచకొండ కమిషనరేట్ పరిధి మీర్‌పేట ఠాణా నుంచి వచ్చిన ఓ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టి, దిల్లీలో ఉన్న నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు.