గోరంట్ల (గుంటూరు). న్యూస్‌టుడే: మమ్మల్ని కారుతో గుద్ది ఆపకుండా వెళ్తావా.. అంటూ ఒకతను వచ్చి తీవ్రంగా కొట్టాడు.. తర్వాత కత్తితో పొడిచాడు.. మళ్లీ పది నిమిషాల తర్వాత మరో ఇద్దరు వచ్చి చితకబాదారు.. చివరలో అరే నువ్వా.. నిన్ను కాదు కొట్టాల్సింది.. అంటూ సారీ చెప్పి చికిత్స కోసం రూ.వెయ్యి ఇచ్చిన ఘటన గుంటూరు నగర శివారులో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గుంటూరు నల్లపాడు పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చుక్కపల్లివారిపాలెంకు చెందిన పల్లం ఏసుదాసు కుమారుడు 18 సంవత్సరాల తేజ అమరావతిలోని వాళ్ల చిన్నమ్మ ఇంట్లో ఉంటూ ఆర్‌వీవీఎన్ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. చర్చి ప్రతిష్ఠాపన ఉండగా వారి తల్లిదండ్రులు శనివారం ఉదయం అమరావతికి వచ్చారు. కార్యక్రమం పూర్తి కాగానే తల్లిదండ్రులను అక్కడి నుంచి కారులో తేజ స్వగ్రామంలో దింపి తిరిగి అమరావతికి బయలుదేరాడు. ఈ క్రమంలో స్థానిక గోరంట్ల ఇన్నర్‌రింగ్ రోడ్డు చైతన్య టెక్నో కళాశాల వద్దకు రాగానే కారు టైరు పంక్చరైంది. దిగి దానిని పరిశీలిస్తుండగా ముందు ఒక యువకుడు వచ్చి మమ్మల్ని కారుతో గుద్ది ఆపకుండా వెళ్తావురా.. అంటూ దుర్భాషలాడుతూ చేత్తో కొట్టాడు. తేరుకునే లోపు వెంటనే కత్తితో పొడిచాడు. పది నిమిషాల తర్వాత మరో ఇద్దరు యువకులు వచ్చి కర్రలతో కొట్టి వెళ్లారు. కొంత సేపు ఆగిన తర్వాత వారు ముగ్గురు తేజ దగ్గరకు వచ్చి ‘సారీ.. బ్రదర్ నిన్ను కాదు.. వేరే వాడిని కొట్టాల్సింది. పొరపాటున నిన్ను కొట్టాం.. ఇదిగో ఈ వెయ్యి రూపాయలు ఉంచుకొని చికిత్స చేయించుకో’.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గాయపడ్డ తేజ నల్లపాడు పోలీసులకు తెలిపాడు. అక్కడి నుంచి తేజ జీజీహెచ్‌కు చేరుకుని చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నల్లపాడు ఎస్‌ఐ ఆరోగ్యరాజ్ తెలిపారు.
సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
AMARAVATHI NEWS WORLD
0
