తలపై కొట్టి... టవల్‌తో గొంతు బిగించి



భార్య, పిల్లలతో రామిరెడ్డి (పాతచిత్రం)

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలంలో సింహాద్రి ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుడిని గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి తలపై కొట్టి.. టవల్‌తో గొంతుబిగించి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పరవాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వాడచీపురుపల్లి పంచాయతీ పరిధి గొరుసువానిపాలెంకు చెందిన గొరుసు రామిరెడ్డి (30) ఐటీఐ పూర్తి చేసి సుమారు పదేళ్లుగా సింహాద్రి ఎన్టీపీసీ సీఅండ్‌ఐ విభాగంలో కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తున్నారు. అలాగే రుణాలు ఇచ్చి వసూలు చేసే వ్యవహారాలూ నిర్వహిస్తున్నారు. మరడ దాసరిపేటకు చెందిన నాగమణితో 2017లో అతడికి వివాహం జరిగింది. ఈ దంపతులకు రెండేళ్లపాప హీక్షిత, ఎనిమిది నెలల కుమారుడు చేతన్‌వెంకట్‌ ఉన్నారు. రామిరెడ్డి అత్తింటివారు పేదలు కావడంతో ప్రస్తుతం కొబ్బరి, అరటిపళ్లు దుకాణం పెట్టుకుని కూర్మన్నపాలెంలో నివాసం ఉంటున్నారు. పిల్లలకు కొద్దిరోజులుగా అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రికి వెళ్లేందుకు వీలుగా ఉంటుందని రెండు వారాలుగా భార్య, పిల్లలను కూర్మన్నపాలెంలోని అత్తవారి ఇంటిదగ్గరే రామిరెడ్డి ఉంచాడు. విధులు ముగిసిన తర్వాత స్వగ్రామమైన గొరుసువానిపాలెం వెళ్లి కొంత సమయం ఉండి మళ్లీ రాత్రికి అత్తగారింటికి వచ్చేవారు. ఇలా వచ్చే క్రమంలోనే హత్య జరిగింది. ఎన్టీపీసీ- సోమునాడుపాలెం రహదారి పక్కన రామిరెడ్డి మృతదేహం రహదారికి సుమారు 20 మీటర్ల్లు దూరంలో శరీరంపై చొక్కా లేకుండా పడి ఉంది. ఘటనను బట్టి చూస్తే రామిరెడ్డిని బుధవారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత నిందితులు అక్కడికి రప్పించి తొలుత ఘర్షణపడి అనంతరం కాళ్లు చేతులు పట్టుకుని...మెడచుట్టూ టవల్‌తో బిగించి చంపి ఉంటారని పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. సౌత్‌ ఏసీపీ రామాంజనేయులురెడ్డి, పరవాడ సీఐ ఉమామహేశ్వరావు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుని సోదరుడు శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Post a Comment

أحدث أقدم