కొత్తగా 26 జిల్లాలు


లోక్‌సభ నియోజకవర్గాలే ప్రాతిపదిక
అరకు పరిధిలో 2 జిల్లాలు
పాడేరు, పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటు
మొత్తం 57 రెవెన్యూ డివిజన్లు
కొత్తగా 9 ఏర్పాటు.. మూడు రద్దు
ఉన్నతస్థాయి అధికారుల కమిటీ ప్రతిపాదనలు

కొత్తగా 26 జిల్లాలు

ఈనాడు, అమరావతి: లోక్‌సభ నియోజకవర్గాలే ప్రాతిపదికగా 26 జిల్లాల ఏర్పాటుకు, మొత్తం 57 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు అధికారుల కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. అరకు లోక్‌సభ నియోజకవర్గంలో పాడేరు, పార్వతీపురం కేంద్రంగా రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని సూచించింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 38 రెవెన్యూ డివిజన్లలో మార్పుచేర్పులు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. కొత్తగా 9 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతోపాటు, ప్రస్తుతమున్న వాటిలో మూడింటి రద్దుకు ప్రతిపాదించింది. జిల్లాల నుంచి సేకరించిన సమాచారం, ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలను క్రోడీకరించిన మేరకు.. కొత్త జిల్లాలు, ముఖ్యకేంద్రం, వాటి పరిధిలో రెవెన్యూ డివిజన్లు, మండలాల వివరాలతో నివేదిక రూపొందించింది. ప్రతి జిల్లాలో 2-3 డివిజన్లు ప్రతిపాదించింది. బాపట్ల జిల్లాలో కొత్తగా బాపట్ల, చీరాల రెవెన్యూ డివిజన్లకు ప్రతిపాదించింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా కొత్త పోలీసు జిల్లాల హద్దులపై ఆ శాఖ దృష్టిసారించాలని సూచించింది. విద్య, ఆరోగ్యం, అటవీ, వాణిజ్యపన్నులు, ఇంజినీరింగ్‌ తదితర శాఖలు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొంది. కొత్త జిల్లాల ఏర్పాటులో విస్తీర్ణం, జనాభా, ఆదాయం, చారిత్రక అనుబంధాలు, భౌగోళిక కొనసాగింపు, ప్రజాప్రయోజనాలు, సమస్యలు, విద్యా, సాంస్కృతిక అవసరాలు, మౌలికసౌకర్యాలు, ఆర్థిక పురోగతి తదితరాంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణలో ఆదిలాబాద్‌ జిల్లా ఏర్పాటుకు అనుసరించిన విధానాలను ప్రస్తావించింది.

రద్దయ్యే రెవెన్యూ డివిజన్లు
* నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్‌ పరిధిలోని ఉదయగిరి నియోజకవర్గ మండలాలను కందుకూరు డివిజన్‌లోకి, ఆత్మకూరు నియోజకవర్గ మండలాలను నెల్లూరు డివిజన్‌లోకి చేర్చాలి.
* పశ్చిమ గోదావరి జిల్లా కుకునూరు డివిజన్‌ పరిధిలోని పోలవరం నియోజకవర్గ మండలాలను కొత్తగా ఏర్పాటయ్యే జంగారెడ్డిగూడెం డివిజన్‌లోకి చేర్చాలి.
* తూర్పుగోదావరి జిల్లా ఎటపాక డివిజన్‌ పరిధిలోని రంపచోడవరం నియోజకవర్గ మండలాలను కొత్తగా ఏర్పాటయ్యే రంపచోడవరం డివిజన్‌లోకి చేర్చాలి.

ఒకే మండలం.. రెండు ప్రతిపాదిత జిల్లాల్లోకి
రాష్ట్రంలో ఐదు మండలాలు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. విజయనగరం జిల్లా జామి మండలానికి చెందిన 12 గ్రామాలు గజపతినగరం (ప్రతిపాదిత విజయనగరం జిల్లా), 16 గ్రామాలు ఎస్‌.కోట (ప్రతిపాదిత విశాఖపట్నం జిల్లా) అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలం పరిధిలోని ఒక గ్రామం గాజువాక (ప్రతిపాదిత విశాఖపట్నం జిల్లా), మూడు గ్రామాలు పెందుర్తి నియోజకవర్గ (ప్రతిపాదిత అనకాపల్లి జిల్లా) పరిధిలో ఉన్నాయి. విజయవాడ రూరల్‌ మండలంలోని 8 గ్రామాలు మైలవరం (ప్రతిపాదిత విజయవాడ జిల్లా), 10 గ్రామాలు గన్నవరం నియోజకవర్గాల (ప్రతిపాదిత మచిలీపట్నం జిల్లా) పరిధిలోకి వస్తున్నాయి. తిరుపతి అర్బన్‌ పరిధిలోని 5 గ్రామాలు తిరుపతి (ప్రతిపాదిత తిరుపతి జిల్లా), రెండు గ్రామాలు చంద్రగిరి (ప్రతిపాదిత చిత్తూరు జిల్లా) నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. అనంతపురం జిల్లాలో అనంతపురం మండలంలోని 5 గ్రామాలు అనంతపురం అర్బన్‌ (ప్రతిపాదిత అనంతపురం జిల్లా), 15 గ్రామాలు రాప్తాడు (ప్రతిపాదిత హిందూపురం/పెనుకొండ) నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. వీటి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని కమిటీ సూచించింది.


కొత్త రెవెన్యూ డివిజన్లు, వాటి పరిధిలోని నియోజకవర్గాలు (మండలాలు)

కొత్తగా 26 జిల్లాలు


బొబ్బిలి రెవెన్యూ డివిజన్‌ (ప్రతిపాదిత విజయనగరం జిల్లాలో): శ్రీకాకుళం, పాలకొండ, పార్వతీపురం డివిజన్ల పరిధిలోని ఎచ్చెర్ల(4 మండలాలు), రాజాం(5), బొబ్బిలి(4)
భీమిలి (ప్రతిపాదిత విశాఖపట్నం జిల్లాలో): విజయనగరం డివిజన్‌లోని ఎస్‌కోట(4), విశాఖపట్నం డివిజన్‌లోని భీమునిపట్నం(4)
భీమవరం/తణుకు (ప్రతిపాదిత నరసాపురం జిల్లాలో): పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు డివిజన్‌లోని తణుకు(3), నరసాపురం డివిజన్‌లోని భీమవరం(2), ఉండి(4), ఏలూరు డివిజన్‌ పరిధిలోని తాడేపల్లిగూడెం(2)
నందిగామ (ప్రతిపాదిత విజయవాడ జిల్లా): విజయవాడ డివిజన్‌లోని నందిగామ(4), జగ్గయ్యపేట(3), నూజివీడు డివిజన్‌లోని తిరువూరు(4)
బాపట్ల (ప్రతిపాదిత బాపట్ల జిల్లా): తెనాలి డివిజన్‌లోని వేమూరు(5), రేపల్లె(4), బాపట్ల(3)
చీరాల (ప్రతిపాదిత బాపట్ల జిల్లా): ఒంగోలు డివిజన్‌ పరిధిలో ఉన్న చీరాల(2), అద్దంకి(5), పర్చూరు(6), సంతనూతలపాడు(4)
ఆత్మకూరు (ప్రతిపాదిత నంద్యాల జిల్లా): నంద్యాల డివిజన్‌లోని పాణ్యం(4), కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు(6), శ్రీశైలం(5)
రాయచోటి (ప్రతిపాదిత రాజంపేట జిల్లా): కడప డివిజన్‌లోని రాయచోటి(6), మదనపల్లి డివిజన్‌లోని పీలేరు(6)
పలమనేరు (ప్రతిపాదిత చిత్తూరు జిల్లా): మదనపల్లి డివిజన్‌లోని కుప్పం(4), చిత్తూరు డివిజన్‌లోని పూతలపట్టు(5)

కొత్తగా ఏర్పాటయ్యే వాటిలో అరకు-1 జిల్లాకు పార్వతీపురం, అరకు-2 జిల్లాకు పాడేరు, హిందూపురం జిల్లాకు హిందూపురం/పెనుకొండను జిల్లా కేంద్రాలుగా ప్రతిపాదించారు.

అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 7 నియోజకవర్గాలను విభజించి 2 జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలను అరకు-1 పరిధిలోకి.. అరకువ్యాలీ, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలను అరకు-2 పరిధిలోకి తేవాలని సూచించారు.

కొత్తగా 26 జిల్లాలు

కొత్తగా 26 జిల్లాలు


Post a Comment

Previous Post Next Post