వకీల్‌ సాబ్‌ చెప్పాడని చెప్పండి..! లేకపోతే అసంబ్లీ ముట్టడి

కృష్ణా జిల్లాలో పవన్‌ పర్యటన

కృష్ణా జిల్లాలో పవన్‌ పర్యటన

ANWtv:గుడివాడ : కృష్ణా జిల్లాలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటన కొనసాగుతోంది. నివర్‌ తుపానుతో నష్టపోయిన పంటలను పవన్‌ పరిశీలిస్తున్నారు. కంకిపాడు నుంచి ర్యాలీగా గుడివాడ మీదుగా ఆయన మచిలీపట్నం చేరుకోనున్నారు. మార్గం మధ్యలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పవన్‌ రైతులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. తుపాను సాయం మరింత పెంచాలని డిమాండ్‌ చేసిన జనసేనాని ఈమేరకు కలెక్టర్‌కు వినతిప్రతం ఇవ్వనున్నారు.  నేేహురు చవక్ వద్ద మహిిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. 


పంట నష్టం పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, జనసేన నాయకులు బురగడ్డ శ్రీకాంతు  జనసేనానని కోరారు. ఈ క్రమంలో గుడివాడ నెహురు  వదనుండి ప్రసంగించారు.


అలా చేయని పక్షంలో అసెంబ్లీ ముట్టడి: పవన్‌


 మచిలీపట్నం: రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అండగా ఉండి వారి సమస్యలపై పోరాడతామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. రాష్ట్రానికి 40 శాతం ఆదాయం సమకూర్చే రైతాంగానికి అండగా ఉండకపోతే 151 మంది ఎమ్మెల్యేలు ఎందుకని వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కృష్ణా జిల్లాలో నివర్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా మచిలీపట్నంలో పవన్‌ మాట్లాడారు. తాము ఏదైనా మాట్లాడితే రాజకీయం చేస్తున్నామంటున్నారని మండిపడ్డారు. పవన్‌ కల్యాణ్‌ అనే వ్యక్తి అస్సలు భయపడడని వ్యాఖ్యానించారు. 

రాజకీయం ఏ ఒక్కరికో చెందిన సొత్తు కాదు

‘‘మేం చాలా పద్ధతిగా మాట్లాడతాం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే జనసేన పార్టీ పెట్టాం. ఓటమి ఎదురైతే కొందరు భయపడి పారిపోతారు.. మేం మాత్రం నిలబడతాం. రాజకీయం ఒక కుటుంబానికో, ఒక కులానికో, ఒక మతానికో చెందిన సొత్తు కాదు. అన్ని కులాలు, మతాలు రాజకీయాల్లో బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. 70శాతం కౌలు రైతులు నష్టపోతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదు. తాము కౌలు రైతులమే అని నిరూపించుకోవడానికి వాళ్లు నానా యాతన పడుతున్నారు. గ్రామ వాలంటీర్లను పెట్టి మీరు సాధించిందేంటి?’’ అని వైకాపాను ఉద్దేశించి పవన్‌ నిలదీశారు.



ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పేర్ని నానిపై పవన్‌ వ్యంగ్య బాణాలు సంధించారు. అనేక మంది నానీల్లో ఈయన ఇంకో నాని అని వ్యాఖ్యానించారు. ‘‘సీఎం సాబ్‌కు వకీల్‌ సాబ్‌ చెప్పాడని చెప్పండి. నివర్‌ తుపానుతో నష్టపోయిన ఒక్కో రైతుకు రూ.10వేలు వెంటనే విడుదల చేయాలి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు మేం అడిగినట్లుగా రైతులకు రూ.35వేలు విడుదల చేయాలి. అలా చేయని పక్షంలో మా కార్యకర్తలతో అసెంబ్లీని ముట్టడిస్తాం. అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతామో మేమూ చూస్తాం. అమరావతి, విశాఖ, పులివెందుల.. ఎక్కడ సమావేశాలు నిర్వహించినా వస్తాం. అసెంబ్లీ ముట్టడిస్తే ఏదైనా జరగొచ్చు. దానికి మేం బాధ్యులం కాదు ’’ అని పవన్‌ హెచ్చరించారు.  

వ్యాపారాలు వదిలేయండి.. నేనూ సినిమాలు వదిలేస్తా

‘‘సినిమాలు చేస్తున్నామని విమర్శిస్తున్నారు. మరి వైకాపా నేతలు చేస్తున్నదేంటి?దేశ సేవా? వాళ్లంతా గాంధీ మహాత్ములా? వైకాపా నేతలు వ్యాపారం చేసుకోవచ్చు.. మేం సినిమాలు చేయకూడదా? కష్టపడి సినిమాలు చేస్తూ ప్రజలకు అండగా ఉంటే విమర్శలు చేస్తున్నారు. మీరు అన్ని వ్యాపారాలు వదిలేసి వస్తే నేనూ సినిమాలు వదిలేసి రాజకీయాలు చేస్తా. ఓడిపోయినా ప్రజల కోసం వచ్చాం. భయపడితే పనులు కావు.. మాకు భయాల్లేవ్! రైతులు కష్టాల్లో ఉంటే అడగకూడదా? విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ ఘటనలో చనిపోయిన వారికి రూ.కోటి పరిహారం ఇచ్చారు. రైతులు చనిపోతే రూ.7లక్షలు మాత్రమే ఇవ్వడం దారుణం. వచ్చే పంటకు విత్తనాలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు.. వాలిపోయిన పంట కొనలేదు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నది ఎందుకు? ఇసుక, మైనింగ్‌, మద్యం మాఫియాతో అడ్డగోలుగా దోచుకునేందుకా? నివర్‌ తుపానుతో నష్టపోయిన అన్ని రకాల రైతులను, మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలి’’ అని పవన్‌కల్యాణ్‌ డిమాండ్ చేశారు.

Post a Comment

Previous Post Next Post