వెలగపూడిలో అర్ధరాత్రి అంత్యక్రియలు


వెలగపూడిలో అర్ధరాత్రి అంత్యక్రియలు

అమరావతి: రాజధాని గ్రామమైన వెలగపూడిలో ఎస్సీల్లోని రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మరియమ్మ(50) ప్రాణాలు కోల్పోయిన  విషయం తెలిసిందే. ఈ ఘటనతో సోమవారం గ్రామం అట్టుడికిపోయింది. రోజంతా రెండు వర్గాల ఆందోళనలు, బైఠాయింపులు, నినాదాలతో రణరంగాన్ని తలపించింది. ఈ ఘటన వెనక ఎంపీ నందిగం సురేశ్‌ ప్రోద్బలం ఉందని, ఆయనపై కేసు నమోదు చేయాలని బాధితులు ఆందోళనకు దిగారు. మృతదేహంతో బైఠాయించి ఆందోళన కొనసాగించారు. ఈనేపథ్యంలో అర్ధరాత్రి ఎస్సీ సంఘాలతో ఏపీ హోం మంత్రి సుచరిత చర్చలు జరిపారు. ఎంపీ సురేష్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చుతామని హోం మంత్రి హామీ ఇవ్వడంతో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మరియమ్మ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. 

ఏం జరిగిందంటే?
 గ్రామంలోని ఎస్సీకాలనీలో కొత్తగా వేసిన సిమెంటు రహదారి ప్రారంభంలో నిర్మించతలపెట్టిన స్వాగత తోరణానికి (ఆర్చీ) పేరు పెట్టే విషయమై కాలనీవాసుల మధ్య కొన్ని రోజులుగా భేదాభిప్రాయాలు వచ్చాయి. తొలుత శనివారం రెండు వర్గాల మధ్య చర్చలు జరిగాయి. ఓ వర్గం వారు బాబూజగ్జీవన్‌రాం పేరు పెట్టాలనగా మరో వర్గం అభ్యంతరం తెలిపింది. దీనిపై అదేరోజు ఘర్షణ జరగ్గా పోలీసులు సర్దిచెప్పి పంపించారు. మరోసారి చర్చించడానికి ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో రెండు వర్గాలు ఒకచోటకు చేరగా.. విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. పరస్పరం రాళ్లు, ఇటుక పెళ్లలు విసురుకున్నారు. ఈ ఘర్షణ సమయంలో మరియమ్మ (50) అనే మహిళ తన ఇంటి ముందు అంట్లు తోముకుంటుండగా రాళ్లు వచ్చి తగిలాయి. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా అర్ధరాత్రి చనిపోయింది. ఆమెకు భర్త దావీదు, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ దాడిలో మరో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా, 30 మంది క్షతగాత్రులయ్యారు. 

Post a Comment

Previous Post Next Post